ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
గోదావరిఖని: చివరిదశ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ డేగకన్ను వేసింది. రామగుండం పోలీసు కమిషనరేట్ లోని అన్నిపోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరించింది. పెద్దపల్లి జోన్‌లోని చివరి విడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కమిషనరేట్‌లోని 1,720 పోలింగ్ కేంద్రాల్లో 563 సమస్యాత్మకమైనవిగా గుర్తించి పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు.
భారీ పోలీసు బందోబస్తు
చివరివిడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 32 మంది సీఐలు, 97 మంది ఎస్సైలు, 270 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోంగార్డులు, 190 మంది ఆర్ముడ్ సిబ్బంది, 54క్యూఆర్‌టీ టీంలు, 57 రూట్‌మోబైల్ పార్టీలను ఎన్నికల విధుల్లో నియమించారు. సుమారు 1,700మందితో బందోబస్తు చేపట్టారు.
1,700 మంది పోలీస్ బలగాలతో పహారా
ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక నిఘా
సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను


