పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో పోలింగ్ 84.15 శాతం నమోదైందని అన్నారు. రెండోవిడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మొత్తం 94,807 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, ఆర్డీవో గంగయ్య, తాహసీల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్గాంలో పర్యటన..
రామగుండం: అంతర్గాం మండలంలోని 15 పంచాయతీల్లో చేపట్టిన పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షించారు. తొలుత ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ఇతరత్రా అంశాలు, అభ్యర్థుల వివరాలు, ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలను ఎంపీడీవో సుమలతను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, ఎంపీవో వేణుమాధవ్ ఉన్నారు.


