ఎన్నికలకు బందోబస్తు
జూలపల్లి(పెద్దపల్లి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి చెప్పారు. స్థానిక కళాశాల ఆవరణలో శనివారం పోలీసు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని ఆయన కోరారు. ఏసీపీ కృష్ణ, ఏఆర్ డీసీపీ ప్రతాప్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వి‘జయలక్ష్మి’
పెద్దపల్లిరూరల్: రాంపల్లి ఉపసర్పంచ్‌గా మడుపు జయలక్ష్మి ఎన్నికయ్యారు. సర్పంచ్‌తో పాటు 8మంది వార్డుసభ్యులు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం రాంపల్లి రైతువేదికలో శనివారం సమావేశమయ్యారు. మడుపు జయలక్ష్మి, కనుకుంట్ల అంజ య్య పదవిని ఆశించారు. ఎవరికి వారే తమకు కావాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో లాటరీ ద్వారా డ్రా తీయగా జయలక్ష్మిని ఉపసర్పంచ్ పదవి వరించింది. ఆమెను సర్పంచ్ కనపర్తి సంపత్‌రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రావు, నాయకులు నర్సింగం తదితరులు అభినందించారు.
సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం
సైక్లింగ్‌లో అపర్ణ–సాయి కృష్ణ దంపతులు
జ్యోతినగర్(రామగుండం): ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం, సైక్లింగ్ ప్రాముఖ్యతను చాటిచెప్పడం కోసమే సైక్లింగ్ చేపట్టామని కరీంనగర్‌కు చెందిన చిందం అపర్ణ – సాయికృష్ణ దంపతులు తెలిపా రు. 600 కి.మీ. వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ఎన్టీపీసీకి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. కరీంనగర్‌లో ప్రారంభమైన సైకిల్‌రైడ్ రామగుండం, వాంకిడి, కరీంనగర్, హైదరాబాద్(రింగ్ రోడ్డు) నుంచి కరీంనగర్ మీదుగా సాగుతుందని వారు తెలిపారు. కోల్ ఇండియా సైక్లింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వెంకటతిరుపతిరెడ్డి తదితరులు వారిని కలిసి అభినందనలు తెలిపారు.
రేపు పత్తి మార్కెట్ బంద్
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మార్కెట్‌లో అడ్తిదారు బుద్దె చంద్రమౌళి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా అడ్తిదారులంతా మార్కెట్ బంద్ ఉంచాలని కోరారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈనెల 15న (సోమవారం) పత్తి నిల్వ లు మార్కెట్‌కు తేవొద్దని ఆయన సూచించారు.
ఎన్టీపీసీలో సమ్మెలు నిషేధం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, 1971 (1971లోని చట్టం 20) నిబంధనల ప్రకారం, ఈనెల 14 నుంచి ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.
కల్లుకు తగ్గిన డిమాండ్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోజూ మద్యం, మాంసంతో విందులు ఇస్తున్నారు. దీంతో తెల్లకల్లుకు గిరాకీ బాగా పడిపోయింది. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీపడేవారు ఇలా ఓటర్లకు మద్యం అందిస్తుండడంతోనే తెల్లకల్లు తాగేందుకు ఎవరూ రావడంలేదని పలువురు గీతకార్మికులు తెలిపారు. అందుబాటులో బీర్లు, విస్కీ, బ్రాండీ ఉండగా.. తెల్లకల్లు తాగుడేందని ఓటర్లు భావిస్తున్నారో ఏమో! తమ వద్ద రోజూ ఈతకల్లు తాగేందుకు వచ్చే వారు ఎవరూ ఇటువైపు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు గీతకార్మికులు పేర్కొంటున్నారు.
ఎన్నికలకు బందోబస్తు


