ఎంపీల నివాసాల ఎదుట నిరసన
పెద్దపల్లి: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో న్యూఢిల్లీలోని తెలంగాణ ఎంపీల నివాసాల ఎదుట బీసీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాగరుషి అరుణ్ కుమార్, జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం, నాయకుడు తాళ్లపల్లి మనోజ్ కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోమటిపల్లి రాజేందర్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రెండేళ్లుగా నమ్మించి. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రతీ ఎన్నికలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, జనవరి 10న ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.


