భీమన్నగుడిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్న ఆలయ ప్రధాన ద్వారం గేటు ఎదుట టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పడమర దిశలోని మహాద్వారం వద్ద గల శివుడి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొడుతున్నారు. శానిటేషన్ ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు సూచిస్తున్నా భక్తులు వినిపించుకోవడం లేదు. అదే సమయంలో భీమన్న ఆలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. రాజన్న ఆలయ పరిసరాల్లోని కొందరు వ్యాపారులు భీమన్న ఆలయ ప్రాంతం, పార్వతీపురం, భీమేశ్వరాలయం వీధి పరిసరాల్లోని రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ నుంచి ప్రత్యేక వాహనం
రాజన్న ప్రధానాలయంలో పనులు చేపట్టేందుకు పంజాబ్ నుంచి ప్రత్యేక వాహనాన్ని తెప్పిస్తున్నట్లు తెలిసింది. ఆ వాహనం ఆలయంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ధర్మగుండం పక్కనే ఉన్న భవనం, ఉత్తర గోపురం పక్కనున్న ప్రహరీలను అధికారులు తొలగించారు. రెండు రోజుల క్రితం బయలుదేరిన ఈ వాహనం శుక్రవారం నాటికి వేములవాడకు చేరుకుంటున్నట్లు తెలిసింది. ఈ వాహనం రాకతో పనులు స్పీడందుకోనున్నాయి.
అధికారుల మధ్య సమన్వయ లోపం
ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పోలీసు, మున్సిపల్‌శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. ఆలయంలో చేపట్టే పనుల విషయంలో తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు జోక్యం చేసుకుని పనులకు ఆటంకం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
రాజన్న గుడి చుట్టూ మొక్కులు
రోడ్లపైకి చేరిన వ్యాపారాలు
భీమన్నగుడిలో భక్తుల రద్దీ


