అమ్మకు ఆపద
సాధారణ మహిళలతో పోల్చితే గర్భిణుల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. ప్రతీ వంద మందిలో 24 మందికి ఈ సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు. గర్భిణికి అధిక మోతాదులో ఐరన్ అవసరమని వారు అంటున్నారు. ఆదినుంచీ రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు డెలివరీ సమయంలో సమస్య వస్తోందంటున్నారు.
గర్భిణులను వేధిస్తున్న రక్తహీనత జిల్లాలో ఎనీమియా బాధితులు 1,551 మంది గర్భిణుల్లో తగ్గుతున్న హిమోగ్లోబిన్ శాతం పోషకాహార లోపమే కారణమంటున్న డాక్టర్లు జీవనశైలిలోనూ మార్పులు కారణం
సాక్షి పెద్దపల్లి: రక్తహీనతతో బాధపడే మహిళలు జిల్లాలో అత్యధికంగా ఉండగా.. గర్భిణులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పోషకాహార లోపం ఇందుకు కారణమని వైద్యులు వివరిస్తున్నారు. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 18 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లలో తరచూ నిర్వహించే వివిధ పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.
మరణాల సంఖ్య పెరిగే అవకాశం..
పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 6,328 మంది గర్భిణులకు డాక్టర్లు, సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. అందులో 1,551 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 60 మందికి పైగా అతితీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారు.
రక్తహీనతకు కారణాలిలు..
పల్లెవాసులకు పౌషకాహారంపై అవగాహన లేక రక్తహీనత బారిన పడుతున్నారు. ఆహారంలో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, సీ, బీ–12 తదితరాలు లోపిస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువతులు అధికంగా జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం, ఆకుకూరలు, పండ్లు తినకపోవడం, డైటింగ్ చేయడం, త్వరగా గర్భం దాల్చడం, ప్రసవం తర్వాత బిడ్డకు బిడ్డకు మధ్య గ్యాప్ లేకపోవడం, డెలివరీ తర్వాత ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వేసుకోకపోవడం, ఆహారం తీసుకోకపోవడం తదితర సమస్యలతో మహిళల్లో రక్తహీనత తలెత్తుతోందని అంటున్నారు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ తక్కువగా వుంటే పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, ప్రసవ సమయంలో రక్తస్రావం అధికం కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
హెచ్‌బీ శాతం ఎంత ఉండాలి?
హెచ్‌బీ(హిమోగ్లోబిన్) సాధారణంగా ఒక్కొక్కరికి సగటున 13 నుంచి 15 శాతం ఉంటే పూర్తిఆరోగ్యంగా ఉన్నట్లు. గర్భిణుల్లో 12 శాతం కచ్చితంగా ఉండాలి. లేదంటే వారు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. తొమ్మిది కన్నా తక్కువ ఉంటే వైద్యుల సూచన మేరకు ఐరన్ మాత్రలు, ఇంజక్షన్లు వాడాలి. ఆరు కన్నా తక్కువ ఉంటే తప్పకుండా రక్తం ఎక్కించుకోవాలి.
ఈ ఆహారం తీసుకుంటే మేలు
నిత్యం బీట్‌రూట్, ఆపిల్, వేరుశెగ, నల్లనువ్వుల ఉండలు, బెల్లం, బచ్చలికూర, చిక్కుడుగింజలు, బఠానీలు, ఎండుద్రాక్ష ఆహారంగా తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. బూడిదగుమ్మడికాయ, గుడ్లు తీసుకున్నా హెచ్‌బీ శాతం పెరుగుతుంది. గుడ్డులో ఐరన్, పాస్ఫరస్, జింక్ అధికమెత్తంలో ఉంటా యి. ఐరన్‌తో అలసట, బలహీనత దూరమవుతాయి. జింక్‌తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రతీ వంద మందిలో
24 మందికి రక్తహీనత
– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో
అమ్మకు ఆపద
అమ్మకు ఆపద


