సాంకేతికతతో ‘సన్నాల’ గుర్తింపు
మంథనిరూరల్: సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం సన్నరకమేనా అని గుర్తించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఈక్రమంలోనే గ్రెయిన్ క్యాలీఫర్ అనే సరికొత్త సాంకేతిక పరికరం వినియోగిస్తోంది. జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచింది.
జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలోని ఆయా మండలాల్లో 334 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 266 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 40 నుంచి 50 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది.
గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంతో..
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 33రకాల సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకంతోపాటు దొడ్డురకాలను సైతం కొనుగోలు చేస్తోంది. వీటిలో సన్నరకాలను గుర్తించేందుకు గ్రెయిన్ క్యాలీఫర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ పరికరం వినియోగిస్తున్నారు.
పొడవు, వెడల్పులతో గుర్తింపు...
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో పిడికెడు ప్యాడీ పాస్కల్‌లో పోసి తిప్పితే ధాన్యంపై పొట్టు ఊడి బియ్యపు గింజలుగా మారుతాయి. ఇందులో ఒక బియ్యపు గింజను తీసుకుని గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంలో వేస్తే ఆ గింజ వెడల్పు, పొడవును చూపిస్తుంది. పొడవు, వెడల్పు ఆధారంగా సన్నరకం గుర్తిస్తారు.
రూ.500బోనస్ చెల్లింపులో..
ప్రభుత్వం సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంతో రైతు ఎదు టే సన్నరకమా? దొడ్డు రకమా? అని గుర్తిస్తారు. తద్వారా బోనస్‌చెల్లింపు పారదర్శకంగా జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అన్నికేంద్రాల్లో ఉన్నాయి
సన్నరకం ధాన్యం గుర్తించేందుకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ క్యాలీఫర్ పరికరాలను అందుబాటులో ఉంచాం. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఈ పరికరంతో తనిఖీ చేసి సన్నరకమా? కాదా? అని గుర్తిస్తాం. రైతులకు ఇబ్బందులు రాకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేసేలా అన్నిచర్యలు చేపట్టాం.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్
కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ క్యాలీఫర్ పరికరం
33 రకాల సన్నరకం ధాన్యం కొనుగోలుకు నిర్ణయం


