ప్రకృతి సంపదను దోచేస్తున్నారు
వేములవాడ అర్బన్: పాలకులు అభివృద్ధి పేరిట ప్రకృతి సంపదను దోచేస్తూ.. విధ్వంసం సృష్టిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. వేములవాడ నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం(ఆర్‌వీకే)లో గురువారం నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ సభకు హాజరై మాట్లాడారు. భారత విప్లవోద్యమం అందించిన వీరనారీమణుల్లో రంగవల్లి ఒక్కరని, ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 1999 నవంబరు 11న పాలకులు ఎన్‌కౌంటర్ పేరిట ఆమెను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆశయసాధనకు వేములవాడలో రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అనే అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల మాట్లాడుతూ హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్‌వీకే) తరహాలో వేములవాడలోని రంగవల్లి విజ్ఞాన కేంద్రం(ఆర్‌వీకే) బుద్ధి జీవులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. సామాజిక మార్పు నిరంతరమని, ఆ దిశగా మనం సాగిపోవాలన్నారు. ‘ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత’పై కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ అసమానతలు, దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయన్నారు. రంగవల్లి, ఇటీవల అమరుడైన లచ్చన్నగౌడ్‌కు జనశక్తి నాయకులు అమర్, ఆర్‌వీకే ప్రతినిధులు నివాళులు అర్పించారు. పోకల సాయికుమార్, రాజేశ్వరి, చెన్నమనేని పురుషోత్తమరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నరాల దేవేందర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు రాయమల్లు, ప్రజా సంఘాల వేదిక నాయకులు వంగల సంతోష్, బీడీ కార్మిక సంఘం నాయకురాలు అనసూయ, లక్ష్మి, వెంకటలక్ష్మి, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు చకినాల అనిల్‌కుమార్, డేగల రమ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్, రాకేశ్, దళిత లిబరేషన్ నాయకులు మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన కళాకారుల ఆటాపాట అరుణోదయ కళాకారుల ఆట, పాటలు అరించాయి. నందికమాన్ నుంచి డప్పు వాయిద్యాలు, నృత్యాలు, ఎర్రజెండాలతో ర్యాలీ సాగింది. కళాకారులు పాటలు ఉర్రూతలూగించాయి. ఇంటలీజెన్సీ పోలీసుల నిఘాలో ఆర్‌వీకే ప్రథమ వార్షికోత్సవం జరిగింది.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
వేములవాడలో ఆర్‌వీకే ప్రథమ వార్షికోత్సవం
హాజరైన జనశక్తి అమర్


