కుమారుడి పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ..
పెద్దపల్లి: తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్తూ మన్య భానువిజయానంద్(55) దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూంనగర్‌కు చెందిన భానువిజయానంద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏవోగా పనిచేస్తున్నారు. అతడి కుమారుడి వివాహం ఈనెల 23న జరగాల్సి ఉంది. బంధుమిత్రులకు పెండ్లి ఆహ్వానపత్రికలు పంచేందుకు బుధవారం రాత్రి తపెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్దకు చేరుకోగానే.. ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికుడు రాజీవ్ రహదారి దాటుతూ బైక్‌కు అడ్డుగా వచ్చాడు. అతడిని తప్పించబోయిన భానువిజయానంద్ వాహనం పైనుంచి పడి తీవ్రగాయాలపాలయ్యా రు. స్థానికు 108 అంబులెన్స్ ద్వారా తొలుత సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల్లోనే వివాహం జరిగే ఇంట్లో విషాదం నెలకొనడంతో కాలనీవాసులు, బంధుమిత్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, విషాదంలోనూ భానువిజయానంద్ కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం


