లైబ్రరీ.. పాఠకుల వర్రీ
అద్దెభవనాలు.. అధికారులు, సిబ్బంది కొరత గ్రంథాలయాలు.. సమస్యలకు నిలయాలు నేటినుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
పెద్దపల్లిరూరల్: పాఠకులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన విజ్ఞానం అందించే గ్రంథాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా గ్రంథాలయంతోపాటు వివిధ మండల కేంద్రాల్లోని లైబ్రరీలకు సొంతభవనాలు లేవు. ఆధునికీకరించి డిజిటలైజేషన్ చేయలేదు. అధికారులు, సిబ్బంది కొరతతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈనెల 14(శుక్రవారం) నుంచి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 20 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేసింది.
రూ.6కోట్లతో జిల్లా గ్రంథాలయ భవనం
జిల్లా కేంద్రంలో దూరదర్శన్ కేంద్ర భవనం(ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్)లో ఏర్పాటుచేసిన జిల్లా గ్రంథాలయానికి అదేస్థలంలో రూ.6కోట్ల అంచనాతో కొత్త భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బహుళ అంతస్తుల్లో నిర్మించే ఈ భవనంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి, మంథని గ్రంథాలయాలను తొలివిడతలో డిజిటల్ చేసేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
పాఠకులకు తప్పని ఇబ్బందులు..
అందుబాటులోకి వస్తున్న ఆధునికతకు అనుగుణంగా లైబ్రరీలను ఆధునికీకరించి డిజిటలైజేషన్ చేయక పోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభానైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆధునికీకరించాలని కోరుతున్నారు. జిల్లా గ్రంథాలయంలో పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకోసం లయన్స్‌క్లబ్ ప్రతినిధులు ఇటీవల రెండు కంప్యూటర్లను సమకూర్చినా ఇంకా వినియోగంలోకి తేవడంలేదు. ఇందుకు సిబ్బంది శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
సొంత భవనాలు లేక..
మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలకు సొంతభవనాలు నిర్మించాల్సి ఉంది. పెద్దపల్లి, జూలపల్లి, రామగుండం, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం లైబ్రరీలు రెంట్ ఫ్రీ పద్ధతిన కొనసాగుతున్నాయి. గోదావరిఖని లైబ్రరీకి సింగరేణి యాజమాన్యం నామమాత్రపు అద్దెప్రతిపాదికన భవనం సమకూర్చింది. ఓదెల, కమాన్‌పూర్‌లోని గ్రంథాలయాలు అద్దె ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వీటికి దశలవారీగా సొంతభవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కార్యదర్శికి ఆరు జిల్లాల బాధ్యతలు..
రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంథాలయాలకు కేవలం 9మంది రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు. ఇకజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరితకు ఆరు జిల్లాల అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాతోపాటు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఆమె విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఇక అటెండర్ మొదలు జూనియర్ అసిస్టెంట్ వరకు.. ఇలా ఏ పోస్టులో కూడా రెగ్యులర్ సిబ్బంది లేరు. కాగా, జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కళాశాల, పాఠశాల స్థాయి విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
వారోత్సవాలు ఇలా..
తేదీ కార్యక్రమం
14 గ్రంథాలయ వారోత్సవాలు షురూ
15 పుస్తక ప్రదర్శన
16 గ్రంథాలయం జ్ఞానాల నిలయంపై వ్యాసరచన పోటీలు(8, 9, టెన్త్ విద్యార్థులకు)
17 విద్యార్థి జీవితంలో గ్రంథాలయ ప్రాధాన్యం(కాలేజీ విద్యార్థులకు)పై ఉపన్యాసం
18 చదువు, జ్ఞానం, సాక్షరత అంశాలపై పాటల పోటీలు
19 రంగోలి, మెహందీ పోటీలు (మహిళలు, విద్యార్థినులకు)
20 వారోత్సవాల ముగింపు వేడుకలు
డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం
జిల్లా గ్రంథాలయానికి సొంతభవనంతోపాటు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో పనులు త్వరలోనే చేపడతాం. పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సిబ్బంది కొరత తీర్చుతాం.
– అన్నయ్యగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు
లైబ్రరీ.. పాఠకుల వర్రీ


