ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ అభివృద్ధిని ఆపేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ స్పష్టం చేశారు. జనగామ గ్రామంలో రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఠాకూర్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధి దిశగా రోడ్డు విస్తరణ త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపారు. గింజ కూడా కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. మొక్కజొన్నలు, పత్తి, వరి, మిర్చి, పొద్దుతిరుగుడు.. ఇలా ఏ పంట సాగు చేసినా ప్రభుత్వం రైతులకు మద్దతు చెల్లిస్తుందని అన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా సింగిల్‌విండో, ఐకేపీ ద్వారా ప్రభుత్వమే ధా న్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నితప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామి, రైతులు, అధికారులు పాల్గొన్నారు.


