‘ప్రైవేట్’దే పెత్తనం
పెద్దపల్లి: ‘నిర్దేశిత ప్రమాణాల కన్నా తేమశాతం అధికంగా ఉంది.. నిబంధనల ప్రకారం నాణ్యంగా లేదు.. ఇలాగైతే మద్దతు ధరతో కొనుగోలు చేస్తే నష్టపోతాం.. తక్కుత ధరకు ఇస్తే ఎలాగోలా సర్దుకుపోతాం’ అంటూ ప్రైవేట్ వ్యాపారులు పత్తి రైతులను గందరగోళంలో పడేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉన్నా.. అధికారులు ఉన్నా.. పెత్తనం మాత్రం ప్రైవేట్ వ్యాపారులదే. పత్తి విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తే.. ధర విషయంలో వ్యాపారులు చెప్పిందే వినాలి. లేదంటే నాణ్యంగా లేదంటూ వారు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి రంగు మారింది. తేమశాతం కూడా 12కు మించి నమోదవుతోంది. ఇలాంటి పత్తిని ఎంత తక్కువ ధరకైనా విక్రయించక తప్పని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. చేసేదిలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన వస్తోంది. నిరక్షరాస్యులైన అన్నదాతల అమాయకత్వం పత్తి వ్యాపారులకు లాభసాటిగా మారింది.
కనిపించని తనిఖీలు
తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ కాంటాలను తరచూ తనిఖీ చేయాలి. కానీ, తనిఖీలు చేయకపోవడంతో కొందరు వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
బాధ్యులు ఎవరు?
పత్తి మార్కెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే పత్తిని నిల్వ చేసేక్రమంలో అనూహ్య ఘటనలు జరుగుతాయని, నీటినిల్వలు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్నదాతలు అధికారులను కోరుతున్నారు.
వ్యాపారులు చెప్పిందే ధర
లేదంటే కొనుగోళ్లు బంద్
నామమాత్రంగా సీసీఐ కొనుగోళ్లు
నష్టపోతున్న పత్తి రైతులు


