సంబంధం లేకుంటే ఎందుకు నిర్మిస్తున్నారు?
గోదావరిఖని: రామగుండం నగరంలో మైసమ్మ గుడుల కూల్చివేతతో సంబంధం లేకుంటే వాటిని ఎందుకు నిర్మిస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. 46 మైసమ్మ, వేల్పులమ్మ దేవాలయాలను కూల్చినోళ్లు మూల్యం చెల్లించక తప్పదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఊరూరా మైసమ్మను కొలిచే సంస్కృతి ఉందని, గుడుల కూల్చవేతతో ప్ర జల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. దీని పై మాట్లాడితే కేసులు పెట్టడం, ఎదురు తిరిగితే దా డులు చేయడం పరిపాటిగా మారిపోయిందని ధ్వ జమెత్తారు. ఆలయాలను కూల్చి వారంరోజులైనా బాధ్యులపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూల్చిన గుడుల స్థానంలో కొత్తవి నిర్మించాలని, లేనిపక్షంలో బల్దియా, ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ఆముల నారాయణ, గోపు ఐలయ్యయాదవ్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, మేడి సదానందం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్


