17శాతం తేమ ఉన్న ధాన్యం తేవాలి
పెద్దపల్లి: రైతులు ధాన్యం ఆరబెట్టి తేమ 17శాతం లోపు వస్తేనే కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. పొలం నుంచి నేరుగా ధాన్యం తీసుకు రావొద్దన్నారు. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ లేకుంటే నాలుగైదు రోజులపాటు ఆరబెట్టుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రో జంతా ఆరబెట్టి రాత్రి ప్లాస్టిక్ కవర్లు కప్పుకోవాలని, లేకపోతే, మంచుకురిసి తేమ శాతం పెరిగే అవకా శం ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరీక్షించి వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆ తర్వాత రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, 48 గంటల్లోగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలని అన్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


