ధాన్యం దోపిడీ..!
అన్నదాత అష్టకష్టాలు
తరుగు పేరిట బస్తాకు రెండు కిలోలు కట్
కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కొనుగోలు
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వెనుకంజ
‘పులి మీద పుట్రలా’ తయారైంది అన్నదాత దుస్థితి. విత్తన దశ నుంచి పంట విక్రయించే వరకు అడుగడుగునా ఆటంకాలే. ఆరుగాలం కష్టపడిన కర్శకునికి కోతల పేరుతో పీల్చి పిప్పిచేస్తుండగా పర్యవేక్షణ నామమాత్రంగా మిగలడం విడ్డూరం. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడిగాపుల కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. రోజుల తరబడి కేంద్రాల్లో నిరీక్షించడం దారుణ పరిణామం. అసలే యాసంగి పనులు ఊపందుకోనుండగా సకాలంలో కొనుగోళ్లు చేయాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూసేవారే కరవయ్యారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుంటే పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిందిపోయి సాకులు వెతకడం అధికారుల వంతవుతోంది. కరీంనగర్ జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతుండగా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నత్తను మరిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి జిల్లాలో ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మార్కెటింగ్ విభాగాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఒక్కో బస్తా తూకం 40.650 కిలోలు వేయాల్సి ఉండగా 43, 44 కిలోలు వేస్తున్నారు. ఇదేంటంటే నాణ్యతలేవని కొత్త రాగం పాడుతున్నారని రైతులు వాపోతున్నారు. అసలే రోజుల తరబడి ఎండిన ధాన్యంలో రాళ్లు ఉంటాయా..నన్నది అధికారులకే తెలియాలి మరి. ఇక మిల్లుల్లో నేరుగా విక్రయించే రైతులకు తరుగు, తేమ పేరుతో బస్తాకు 3–5కిలోలు కోత విధిస్తున్నారు. కోత తర్వాతే మిగిలిన ధాన్యం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కుప్పల్లా ధాన్యం పేరుకుపోతుండగా టార్పాలిన్లు పావు వంతు కూడా అందలేదు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తరచూ వర్షం పడుతుండగా ధాన్యం కొట్టుకుపోతుంది. పైపెచ్చు రూపు మారుతుండటంతో అన్నదాతలు అపసోపాలు పడుతున్నారు. చిరిగిన టార్పాలిన్లు ఎందుకు కొరగాకపోగా ఇళ్లలోని కవర్లను వినియోగిస్తున్నారు.
ఇంకా ప్రారంభం కాలె..
ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్ల తీరును పరికిస్తే పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పేలవం. 408 కేంద్రాలకు కేవలం 223 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా పెద్దపల్లి జిల్లాలో 333 కేంద్రాలకు 86 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరగడం ఆందోళనకర పరిణామం. సగానికి పైగా కేంద్రాలు ప్రారంభించకపోవడం అన్నదాతలకు పడిగాపులే. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెచ్చు కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి.
ఎటు చూసినా ధాన్యం రాశులే..
గత వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రస్తుత కొనుగోళ్లకు భారీ వ్యత్యాసముంది. కొనుగోళ్లలో వేగం పెరిగినా తరుగు దోపిడీ ఆగడం లేదు. లారీల సమ స్య, గన్నీ సంచుల కొరత, ధాన్యం పట్టే యంత్రాలు సరిపడా లేకపోవడం, మిల్లుల్లో స్థలం కొరత క్ర మంలో ఎటూ చూసినా ధాన్యం రాశులే దర్శనమి స్తున్నాయి. ఒక్కో రైతు పక్షం రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. అధికార యంత్రాంగం తమకున్న సామర్థ్యం క్రమంలో లారీలు సమకూర్చుతుండగా, ధాన్యం నిల్వ చేసేందుకు స్థల సమస్య ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నిబంధనల ప్రకారం ధాన్యం నాణ్యంగా ఉన్నా ఏదో సాకుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది.
పెద్దపల్లి జిల్లాలో కొనుగోళ్లు ఇలా..
కొనుగోలు కేంద్రాలు : 333
కొనుగోలు చేస్తున్నవి : 86
సేకరించిన ధాన్యం : 7,890.069 మెట్రిక్ టన్నులు
మొత్తం రైతులు : 1,140
మొత్తం ధాన్యం విలువ : రూ.18.85కోట్లు
మిల్లర్లకు చేరిన ధాన్యం విలువ : రూ.12.59కోట్లు
రైతులకు చెల్లించిన నగదు : రూ.9.40కోట్లు
చెల్లించాల్సిన నగదు : రూ.9.45కోట్లు
ధాన్యం దోపిడీ..!


