వైద్యవిద్యకు ఊపిరి
సిమ్స్‌కు 16 పీజీ సీట్లు కేటాయింపు వైద్య సేవలకు కొత్త వెలుగులు కొనసాగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియ మెడికల్ కాలేజీలో మెరుగైన సౌకర్యాలు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండంలోని సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలకు పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సులు మంజూరు కావవడంతో వైద్యబోధన వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసినట్లయ్యింది. సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్– ప్రభుత్వ) కళాశాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 పీజీ సీట్లు కేటాయించడం ఇందుకు కారణమైంది. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో కాలేజీకి మంచి రేటింగ్ వచ్చింది. దేశంలోని విద్యార్థులు సిమ్స్‌ను ఎంచుకోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
సిమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
డాక్టర్ నరేందర్ : నాలుగేళ్ల క్రితం గోదావరిఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంతం, కాలేజీ బిల్డింగ్‌తోపాటు హాస్టళ్లు, ఫ్యాకల్టీ క్వార్టర్స్, క్యాంటీన్ తదితర నిర్మాణాల కోసం సింగరేణి నిధులు కేరాయించింది. నిధులు ఇచ్చినందున ‘సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)’గా కాలేజీకి నామకరణం చేశారు. 2022– 23వ విద్యాసంవత్సరం నుంచే సొంత భవనంలోనే తొలి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించాం.
సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?
డాక్టర్ నరేందర్ : కొత్త మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల కేటాయింపు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఏంసీసీ)ద్వారా జరుగుతుంది. జాతీయస్థాయిలో 50 శాతం ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా 50 శాతం కింద కేటాయిస్తారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వంటి రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది.
పీజీ కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేశారా?
డాక్టర్ నరేందర్ : మరో 16 పీజీ సీట్లు మంజూరు చేయించుకోవడానికి చర్యలు చేపడతాం.
బోధనకు సౌకర్యాలు ఏమిటి?
డాక్టర్ నరేందర్ : పీజీ స్టూడెంట్స్ కోసం బోధన సిబ్బంది, ల్యాబ్, క్లినికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీంతోనే ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది.
పీజీ కోర్సులతో ప్రయోజనాలు ఏమిటి?
డాక్టర్ నరేందర్ : పీజీ కోర్సులన్నీ అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత వైద్య విద్యా అవకాశాలు లభిస్తాయి.
పీజీ సీట్లు ఎన్ని? అందులోని విభాగాలు ఏమిటి?
డాక్టర్ నరేందర్ : 2025–26 విద్యా సంవత్సరంలో సిమ్స్‌కు 16 పీజీ కోర్సులు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందులో ఎండీ (ఎమర్జెన్సీ మెడిసిన్), ఎంఎస్(గైనకాలజీ), ఎంఎస్ (ఆర్థోపెడిక్), ఎండీ(బయోకెమిస్ట్రీ) విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బోధన తరగతులు ప్రారంభం అవుతాయి.
పీజీ విద్యార్థులతో వైద్యసేవలు మెరుగవుతాయా?
డాక్టర్ నరేందర్ : పీజీ స్టూడెంట్లు రెసిడెంట్ డాక్టర్లుగా 24 గంటలపాటు పేషెంట్లకు సేవలు అందిస్తారు. అత్యవసర విభాగం నుంచి శస్త్రచికిత్సల వరకు నిపుణుల సహకారం లభిస్తుంది. పరిశోధన, ప్రాజెక్టులు వైద్యరంగం అభివృద్ధికి దోహదం చేస్తాయి.
సిమ్స్‌లో బోధన తీరు ఎలా ఉంది? మెడికోల భద్రతకు తీసుకుంటున్న చర్యలేమిటి?
డాక్టర్ నరేందర్ : సిమ్స్‌లో బోధన అద్భుతం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వెబ్ సైట్‌లలో సిమ్స్‌కు 4.6 రేటింగ్ రావడం గర్వకారణం. మెడికోల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు తావులేదు. పోలీసుల నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుంది.
ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు?
డాక్టర్ నరేందర్ : కాలేజీకి మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 2022–23, 2013–24, 2024–25, 2025–26 విద్యాసంవత్సరాల్లో చేరిన విద్యార్థులతో కలిపి ప్రస్తుతం 600 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లు ఉన్నారు. సీట్ల కేటాయింపులో 85 శాతం లోకల్(తెలంగాణ రాష్ట్రం), 15 శాతం ఆలిండియా కేటగిరీ ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ఏడు సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేశారు.
వైద్యవిద్యకు ఊపిరి


