పెర్కపల్లిలో 25 గొర్రెలు మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): పెర్కపల్లి గ్రామంలో 25 గొర్రెలు మరణించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కాపరులు గ్రామ శివారులో రైతులు కోసిన వరి పొలంలోకి గురువారం మేతకు తీసుకెళ్లారు. వరి మొదళ్ల తినడంతో అప్పటికే వేసిన పురుగుమందు విషయంగా మారి పలు గొర్రెలు అస్వస్థకు గురయ్యాయి. అదేరోజురాత్రి రెండు గొర్రెలు చనిపోగా శుక్రవారం మరికొన్ని తీవ్రఅస్వస్థకు గురయ్యాయి. మంత్రి లక్ష్మణ్‌కుమార్ సూచనలతో కలెక్టర్ స్పందించి.. గొర్రెలకు వైద్యం అందించాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్‌భాస్కర్‌ను ఆదేశించారు. స్థానిక పశువైద్య సిబ్బందిని వెంటనే ఘటనా స్థలికి చేరుకుని చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందిన గొర్రెలకు ప్రాణాపాయం తప్పింది. అప్పటికే ఈరు మల్లయ్యకు చెందిన 8, మెట్టె తిరుపతికి చెందిన 6, అచ్చె రాజయ్యకు చెందిన 6, అచ్చె చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు.. మొత్తంగా మృత్యువాత పడ్డాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, సోషల్ మీడియా ప్రతినిధి బుట్టిసాగర్ బాధితులకు అండగా నిలిచారు. కాపరులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు.


