మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు
జగిత్యాలక్రైం: సరదా కోసం మైనర్లు వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమవుతూ.. వారు కూడా మృత్యుఒడికి వెళ్తున్నారు. మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నా, అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడుగురు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ మృత్యువాత పడగా, 11 కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న మైనర్ డ్రైవింగ్
మైనర్లు తెలిసి తెలియక ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు, అధునాతన పెద్ద వాహనాలు నడుపుతుండటంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారులో మేడిపల్లికి చెందిన బాలుడు ద్విచక్ర వాహనం నడిపి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ధర్మపురి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ ద్విచక్ర వాహనంతో మహిళను ఢీకొనగా కాలు విరిగింది. ఇలా రోజుకో మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పోలీసుల కఠిన చర్యలు
జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులు, వాహనం నడిపిన మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 199 (ఏ) ప్రకారం వాహనం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడితే మైనర్ తండ్రిని దోషిగా పరిగణిస్తారు. అలాగే మూడేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.25 వేల జరిమానా విధిస్తారు. కఠిన నిబంధనలు ఉన్నా మైనర్ డ్రైవింగ్‌లు, ప్రమాదాలు ఆగడం లేదు.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం
మైనర్ డ్రైవింగ్‌పై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరిగితే వాహన యజమానితో పాటు, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది తెలిసితెలియక వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులకు తీరని బాధగా మిగిలిపోతోంది.
– రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల
మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు
మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు


