ప్రజా జీవన స్థితిగతులపై సర్వే
పెద్దపల్లి/కోల్‌సిటీ(రామగుండం): ప్రజాజీవ న స్థితిగతులపై జాతీయ గణాంకశాఖ సర్వే చేస్తోందని గణాంక శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీని ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో కలుసుకున్నారు. సర్వే వివరాలతో కూడిన పోస్టర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలతోపాటు రామగుండం నగరంలో ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే చేశామన్నారు. తొలుత రామగుండం నగరంలో సర్వే ప్రారంభించామని ఆయన తెలిపారు. కుటుంబ యజమాని, ససభ్యులు, విద్యార్హతలు, వృత్తివిద్య కోర్సులు, స్వయం ఉపాధి తదితర అంశాలు నమోదు చేస్తామని ఆయన వివరించారు.
రేపటి నుంచి ప్రత్యేక రైళ్లు
రామగుండం: చర్లపల్లి నుంచి దానాపూర్ మధ్య ఈనెల 9వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలు.. చర్లపల్లి–దానాపూర్(07049– 9, 16వ తేదీల్లో), దానాపూర్–చర్లపల్లి(07050 – 10, 17వ తేదీల్లో), సంభల్‌పూర్–బెంగళూరు కంటోన్మెంట్(08335– ఈనెల 20వ తేదీన), బెంగళూరు కంటోన్మెంట్–సంభల్‌పూర్(08336– ఈనెల 24వ తేదీన), కటక్–బెంగళూరు కంటోన్మెంట్(08445– ఈనెల 21వ తేదీన), బెంగళూరు కంటోన్మెంట్–కటక్(08446– ఈనెల 25వ తేదీన) రామగుండం మీదుగా నడిపిస్తారు. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగపూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా, ప్రయాగ్‌రాజ్ చౌకీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఎరా స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని ఓ గ్రామంలో చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారులు శుక్రవారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారి జితేందర్ ఆదేశాల మేరకు పోలీస్, చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేశారు. ఒక బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. మరోబాలికకు అప్పటికే వివాహం జరగ్గా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతోపాటు వారిని సలెండర్ చేయాలని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సూపర్‌వైజర్ రమాదేవి తెలిపారు.
సదర్‌మాట్ ప్రాజెక్టులో పడి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ శివారులో గల సదర్‌మాట్ ప్రాజెక్టులో పడి పల్లికొండ సిద్దార్థ (18) మృతిచెందాడు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన సిద్దార్థ గురువారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు సదర్‌మాట్ ప్రాజెక్టువద్దకు వచ్చాడు. గేట్ నంబర్ 52 వద్ద చేపలు పడుతుండగా ప్రమాదశాత్తు ప్రాజెక్టులో పడి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రజా జీవన స్థితిగతులపై సర్వే


