రాజాపూర్‌ను స్వాధీనం చేసుకోండి
● అలాగైతేనే సింగరేణి ఓసీపీకి మా భూములు ఇస్తాం ● అధికారులకు గ్రామస్తుల విన్నపం ● పోలీస్ పహారా మధ్య అధికారుల ఇళ్ల పరిశీలన
రామగిరి(మంథని): తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని రాజాపూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఓసీపీ–2 విస్తరణలో భాగంగా రాజాపూర్ పరిహారం కోసమే సుమారు 53 ఇళ్లు అక్రమంగా నిర్మించారనే సమాచారంతో సింగరేణి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య శుక్రవారం గ్రామంలో ఇళ్లపరిశీలన చేపట్టారు. అనంతరం జేసీబీలు మోహరించారు. మంథని, సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బందితో గ్రామాన్ని దిగ్బంధించారు. పోలీస్ పహారా గురించి తెలుసుకున్న గ్రామస్తులు.. అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్లకు అనుమతులు ఉన్నాయని, సింగరేణి అధికారులు అక్రమ కట్టడాలు అని ఎలా నిర్ధారించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, మిగిలిన అరకోర భూమిలో నివాసం ఉండలేమన్నారు. అలాగైతేనే తమ ఊరుకు రావాలని, నిర్వాసిత గ్రామంగా ప్రకటించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంంలో తహసీల్దార్ సుమన్, సింగరేణి ఎస్టేట్ అధికారి ఐలయ్య, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, మండల పంచాయతీ అధికారి భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.


