గ్యారంటీ ఇస్తేనే సీఎమ్మార్
పెద్దపల్లి: సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వ కుండా మోసం చేసే రైస్‌మిల్లర్లను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతసీజన్‌లో 50 శాతం ధాన్యం మరాడించి ప్రభుత్వానికి అప్పగించిన వారు జిల్లాలో 10 శాతం మందే ఉన్నారని సర్కార్ గుర్తించింది. ఈమేరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే సీఎమ్మార్ కేటాయిస్తామని సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ ప్రకటించగా.. బుధవారం వరకు జిల్లాలోని 70 మంది రైస్‌మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ బాండ్లు సమర్పించారు. నవంబర్ మొదటివారం వరకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవుతాయని, ఆలోగా బాండ్లు తెచ్చిఇవ్వాలని ఆయన సూచించారు.
బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి
సీఎమ్మార్ బకాయిలపై కఠినంగా వ్యవహరించేలా గతేడాది కొత్త విధానం తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఈ ఏడాది వానకాలంలో బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వీటిని జిల్లాలో 165 మంది రైస్‌మిల్లర్లకు ఇటీవల అధికారులు అందజేశారు. సీఎమ్మార్ బకాయి లు లేని రైస్ మిల్లర్లు 10శాతం, డిఫాల్ట్ మిల్లర్లు 25శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారు.
83 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో ఇప్పటివరకు 83 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. నిర్దేశిత తేమశాతం ఉన్న ధాన్యం తూకం వేసి మిల్లులకు కేటాయిస్తున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను నవంబర్ మొదటివారంలో ప్రారంభించనున్నారు.


