వచ్చే 48గంటలు వరికోతలు వద్దు
పెద్దపల్లి: ‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. జిల్లాలోనూ తుపాను ప్రభావం ఉంటుంది. వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు రోజులు వరికోతలు కోయవద్దు’ అని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు రైతులకు సూచించారు. మొక్కజొన్న, పత్తి పంటలను సైతం మార్కెట్‌కు తీసుకురావొద్దని అన్నారు. నవంబర్ మొదటి వారంలో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
అందుబాటులో టార్ఫాలిన్లు..
నేడు, రేపు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే ప్రారంభించిన 83 కొనుగోలు కేంద్రాల్లో 7,740 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. వర్షం కారణంగా పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లావ్యవసాయ అధికారితో పాటు ఏఈవోలను అప్రమత్తం చేశాం. హార్వెస్టర్లు వరి పంటలు కోయొద్దని సూచించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రాల్లో 150 ప్యాడీనర్లు 334 మ్యాచర్ మీటర్లు, 989 వెయిట్ మిషన్లు ఉన్నాయి. వరితో పాటు రెండుచోట్ల మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించాం.
ఇబ్బందులు లేకుండా చర్యలు
కేంద్రాల్లో హమాలీ సమస్య లేదు. ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలకు ధాన్యం తరలింపు బాధ్యతలు ఇచ్చాం. తూకం వేయకుండా మిల్లులకు తరలించి అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసుకోవచ్చు. ధాన్యంలో కోత పెడితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సన్నధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తాం. ధాన్యం కేటాయింపులో పైరవీలకు తావు లేదు. జిల్లాలో 158 బైల్డ్, రారైస్ మిల్లులున్నాయి. ప్రతి మిల్లు పదిశాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించాం. డిఫాల్ట్ మిల్లులు 25శాతం గ్యారంటీ ఇవ్వాల్సిందే.


