పసిబిడ్డకు ఊపిరి పోశారు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ప్రసూతికి పెద్దపల్లిలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి హైబీపీ రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. బరువు తక్కువ ఉన్న శిశువు జన్మించడంతో వైద్యుల పర్యవేక్షణలో 22 రోజులు చికిత్స అందించి మంగళవారం డిశ్చార్జి చేశారు. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన లావణ్య గర్భిణి కాగా.. నెలవారీ పరీక్షలకు ఈనెల మొదటివారంలో జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో బీపీ పెరగడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశారు. 1.3కేజీల బరువుతో మగబిడ్డ జన్మించాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తాయి. ఆసుపత్రిలోని నవజాత శిశు యూనిట్‌లో సీపాప్ ద్వారా రెండు రోజులు కృత్రిమశ్వాస అందించారు. మరో రెండు రోజులు నాసల్ ప్రాంజ్ ద్వారా శ్వాస అందించారు. బాబు తనంతట తాను శ్వాస తీసుకుంటున్నట్లు గమనించి తల్లిపాలు తాగించారు. పసిబిడ్డతో వ్యవహరించాల్సిన పద్ధతులపై తల్లికి కంగారు మదర్‌కేర్ శిక్షణ ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ తెలిపారు. బాబు 1.5 కేజీల బరువు పెరగడంతో మంగళవారం డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. పసిబిడ్డకు ఊపిరిపోసిన ఎస్‌ఎన్‌ిసీయూ వైద్యులు, సిబ్బందిని సూపరింటెండ్ అభినందించారు.


