జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
గోదావరిఖని: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం ఆసిఫాబాద్ వెళ్తున్న సందర్భంగా కాసేపు ఆయన గోదావరిఖనిలో ఆగి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిల్లు తీసుకొస్తే.. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండకూడదనే కుట్రతోనే బీసీల రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రప్రభుత్వంపై ఉద్యమించి బీసీ రిజర్వేషన్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి రవికుమార్, కె.భూపాల్, వై.యాకయ్య, మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, టి.రాజారెడ్డి, ఎన్.భిక్షపతి, సీహెచ్ శైలజ, గీట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


