సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అర్జీ ల రూపంలో అందే సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్య క్రమం ద్వారా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఓదెల మండలం జీలకుంటలోని దార సతీశ్.. సర్వే నంబరు 563లోగల 16 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయగా.. తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మంథని లక్ష్మి ఉరఫ్ సంధ్య.. సర్వే నంబర్ 309లో తనకు ఐదెకరాలను లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం కింద కేటాయించాలని విన్నవించగా.. ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. తన పోషణ విస్మరించి ఇంట్లోంచి గెంటేసిన కుమారుడు శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని రామగుండం మండలం వీర్లపల్లికి చెందిన భోజరాజు దరఖాస్తు చేయగా.. తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. పెద్దపల్లి కమాన్‌వాడకు చెందిన వేణు మాధవ్.. కమర్షియల్ ఏరియా వెనకాల ఖాళీస్థలం చిత్తడిగా ఉండడంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయని అర్జీపెట్టారు. తగిన చర్యలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.


