ఎత్తిపోతలు ఉత్తవేనా?
కమ్ముకుంటున్న నీలినీడలు? ‘పోతారం’పై సన్నగిల్లుతున్న ఆశలు కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలు 30 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం పత్తిపాక ప్రాజెక్టుపై ప్రశ్నల పరంపర
మంథని: పోతారం – విలోచవరం గ్రామాల మధ్య చేపట్టిన ఎత్తిపోతలపై అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని మండలం సిరిపురం సమీప పార్వతీ బ్యారేజీకి అనుసంధానంగా గత ప్రభుత్వంలో ఎత్తిపోతల ప్రతిపాదించారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందా? అని రైతులు ఐదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాకలో చేపట్టినప్రతిపాదిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంథని ప్రాంత టేలెండ్ రైతుల కష్టాలు తీర్చుతామనే హామీలూ కాల్యరూపం దాల్చడంలేదు.
తలాపునే గోదావరి .. సాగునీటికి తంటాలు
జిల్లాలో మంథని నియోజకవర్గం టేలెండ్ ప్రాంతం కావడంతో వర్షాధార పంటలే పండిస్తున్నారు. తలాపునే గోదావరి నది ఉన్నా సాగునీటి అవస్థలు తప్పడంలేదు. ఎగువన ఉన్నన ఎస్సారెస్పీ నీరు అన్నిప్రాంతాలకు చేరడం లేదు. డీ–83 ద్వారా సరఫరా చేసే సాగునీరు కమాన్‌పూర్, రామగిరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లోగల ఆయకట్టుకే.. అదికూడా ఆరుతడి పంటలకే సరిపోతోంది. మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని చివరి ఆయకట్టుకు చుక్కనీరు అందడం లేదు. దీంతో సాగు భూములు ఏళ్లుగా బీళ్లుగా ఉంటున్నాయి. డీ–83 కాలువుపై భారం తగ్గించడంతోపాటు ఎస్సారెస్పీ ఆయకట్టులోని 20 వేల ఎకరాలు, టేలెండ్‌లోని చివరి భూములు, కొత్తగా 10 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావడం కోసం గత ప్రభుత్వం పోతారం వద్ద ఎత్తిపోతలకు ఐదేళ్ల క్రితం ప్రణాళిక రూపొందించింది.
రూ.320 కోట్లతో ప్రతిపాదనలు
పోతారం–విలోచవరం మధ్య ప్రతిపాదించిన ఎత్తిపోతలతో 3 టీఎంసీలు ఎత్తిపోయాలని అధికారు లు ప్రతిపాధించారు. ఇందుకోసం పోతారం నుంచి సుందిళ్ల, ఎల్–8 నుంచి చల్లపల్లి, ఎల్–6 నుంచి కన్నాల వరకు మూడు పైపులైన్లు నిర్మించాలని నిర్ణయించారు. పథకం కోసం మొత్తం రూ.320 కోట్లతో అంచనాలు రూపొందించగా.. నిధుల మంజూరుకు ఆర్థికశాఖ అనుమతి లభించింది. కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో కొత్తం ప్రభుత్వం కొలువుదీరడం.. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై రగడ కొనసాగుతున్న క్రమంలో ఎత్తిపోతలు ప్రారంభం కావడం సులువేమీకాదని నిపుణులు భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై ఆశలు..
సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టు సాగునీటి కష్టాలు తీర్చేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించారు. ఇందుకోసం జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాకలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంథని ప్రాంతానికి వచ్చే డీ–83, –86 కాలువలకు అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. ఆ దిశగా ప్రయత్నాలు ఎక్కడా సాగడంలేదు. టేలెండ్ ప్రాంతాల్లోని భూములు సాగులోకి తీసుకువచ్చేలా ఎత్తిపోతలు, లేదా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎత్తిపోతలు ఉత్తవేనా?


