
యువకుడిపై కత్తితో దాడి
జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో కట్ల శ్రీకాంత్ అనే యువకుడిపై సందీప్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరచడంతో బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గోవిందుపల్లెకు చెందిన సందీప్ ఆటోడ్రైవర్. సందీప్‌కు ఓ పంచాయితీ ఉండడంతో శ్రీకాంత్‌ను మధ్యవర్తిగా తీసుకెళ్లాడు. అక్కడ తనకు కాకుండా ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్నాడని మనసులో పెట్టుకుని సందీప్.. రెండు రోజులుగా శ్రీకాంత్‌కు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో ఇద్దరూ కరీంనగర్ రోడ్డులో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాట పెరిగి శ్రీకాంత్‌పై తన వెంట తెచ్చుకున్న కత్తితో సందీప్ దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీకాంత్ చెవ్వు, మెడ, కడుపులో గాయాలయ్యాయి. స్థానికులు శ్రీకాంత్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
తల్వార్‌తో జన్మదిన వేడుకలు..
జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ అనే వ్యక్తి రోడ్డుపై.. జనావాసాల మధ్య తల్వార్‌ను పట్టుకుని మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం సాయికృష్ణ శనివారం రాత్రి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తల్వార్ చేతపట్టుకుని మిత్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద సాయికృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కడుపునొప్పితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మల్యాల: కడుపునొప్పితో మండలంలోని రామన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని హారిక (16) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన ఒడిగ గంగాధర్, వరలక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం రామన్నపేటకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. గంగాధర్ లారీ డ్రైవర్. తల్లి వ్యవసాయ కూలీ. వీరి రెండో కూతురు హారిక జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటోంది. అయినప్పటికీ తగ్గకపోవడంతో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
పెగడపల్లి: మండలంలోని ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు సుప్రియ (27) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. సుప్రియ కొంతకాలంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవలే కామెర్ల వ్యాధిబారిన పడింది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఆరోగ్యం కుదటపడలేదు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 12న బ్లాక్‌రోజ్ పౌడర్ తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సుప్రియ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
రామడుగు(చొప్పదండి): మండలంలోని వెలిచాల గ్రామ పరిధి కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన చాట్ల నర్సయ్య (65) చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. ఈ నెల 3న చాట్ల నర్సయ్యకు ఇదే గ్రామానికి చెందిన చాట్ల గంగారాం మధ్య గొడవ జరగడంతో పంచాయితీ నిర్వహించుకున్నారు. పంచాయితీ జరుగుతుండగా గంగారాం, నర్సయ్య మధ్య గొడవ జరిగింది. దీంతో గంగారాం కుమారుడు భాస్కర్ మా నాన్నను ఎందుకు తిడుతున్నావని నర్సయ్యపై ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడంతో కిందపడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న సిమెంట్ రాయితో ముఖంపై కొట్టడంతో పాటు గంగారాం కూడా దాడి చేయడంతో నర్సయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. 6న బాధితుడిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి కూతురు కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● రూ.1.25లక్షలు కాజేసిన కేటుగాడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన ఒక వ్యక్తికి ముద్రలోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజుగా పలు దఫాలుగా రూ.1.25లక్షలు కాజేశాడు. అయినా లోన్ మంజూరుకాకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై కె.రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.