
కనుపాపను కాపాడండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇంట్లో చలాకిగా తిరగాల్సిన చిన్నారి ఆస్పత్రి బెడ్‌పై కదలలేని స్థితిలో ఉంది. ఆడపిల్ల పుట్టగానే సంతోషించిన తల్లిదండ్రులకు ఆమెకు వచ్చిన అనారోగ్య సమస్యతో వేదన మొదలైంది. చక్కగా బడికి వెళ్లే చిన్నారి వెన్నుముక సమస్యతో కాళ్లు చేతులు పడిపోవడంతో మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ చేస్తే నడుస్తుందన్న వైద్యుల సూచనలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రూ.4లక్షలు అవసరం ఉంటాయని వైద్యులు తెలపడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌కు చెందిన మిడిదొడ్డి భాగ్య–మల్లేశం దంపతులకు ఐదో తరగతి చదువుతున్న కూతురు సాత్విక ఉంది. నిత్యం చలాకీగా బడికి వెళ్లే చిన్నారి హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితం కావడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు వెన్నుపూసలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్‌కు రూ.4లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని వారు ఆ డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలవగా.. స్పందించిన కలెక్టర్ రూ.74,938 చెక్కును అందించారు. దీంతో వారు చిన్నారిని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్సకు ఈ మొత్తం సరిపోకపోవడంతో దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన దాతలు మిడిదొడ్డి భాగ్యకు 96181 51488లో సాయం చేయాలని వేడుకుంటున్నారు.
వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని
బడిలో ఉండాల్సిన చిన్నారి ఆస్పత్రిలో..
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సాత్విక
శస్త్రచికిత్సకు రూ.4లక్షలు అవసరం
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు