
ఏం చేయాలి?
నిద్ర కరువు.. బతుకు బరువు
కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళనకు ప్రధాన కారణం
ఆధునిక జీవనశైలితో వెంటాడుతున్న నిద్రలేమి
కష్ట జీవుల్లో పెరుగుతున్న సమస్యలు
కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్: నిద్ర చోటెరగదు అంటారు. దానిని ఆపడం ఎవరితరమూ కాదు. మహాఅయితే ఒకరోజు ఆపగలమేమోగానీ.. కునుకు తీయకుండా మాత్రం ఉండలేం. అయితే.. మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల మధ్య యువత, వృద్ధుల్లో కంటినిండా నిద్ర కరువవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటినిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. వీటిలో ప్రధానమైనవి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
నిద్రలేమితో సమస్యలివీ..
● ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, చురుకుదనం తగ్గడం
● రోడ్డు ప్రమాదాలకు గురికావడం
● చిరాకు, కోపం, పనులపై దృష్టి కోల్పోవడం
● రక్తపోటు, గుండెజబ్బులకు దారితీయడం
● తలనొప్పి, కండరాల నొప్పి
● జీవనక్రియ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత
● బరువు పెరగడం, మానసిక రుగ్మతలు, రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం
ఏం చేయాలి?
● బరువును నియంత్రణలో పెట్టుకోవడం
● రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చాలా ప్రధానం
● మంచి నిద్ర కోసం పడకగదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి
● నిద్రపోయే సమయానికి గంట ముందు సెల్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు కట్టేయాలి
● సంగీతం వినాలి, పుస్తకాలు చదవాలి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం, నచ్చిన వారితో గడపటం లాంటి చర్యలతో ఒత్తిడి, ఆందోళన నుంచి బటయ పడొచ్చు.
● వ్యాయామంతో మంచి నిద్ర పడుతుంది. రోజూ కనీసం గంటపాటు నడక, ఈత, సైక్లింగ్ లాంటివి చేయాలి.
● కుటుంబ సంబంధాలు సరిగా ఉండడమూ ముఖ్యమే. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే.. ఇంటి పనిలో ఇద్దరూ భాగస్వామ్యం తీసుకోవడం వల్ల ఒక్కరిపైనే ఒత్తిడి పడకుండా ఉంటుంది.
కారణాలు ఎన్నో..
∙ వృత్తి, వ్యక్తిగతంగా చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. ఆందోళన ఎక్కువై కునుకు రావడంలేదు. కొందరిలో జీవనశైలి మార్పులతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది.
∙ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువగా తినడం వల్ల పొట్టలో అసౌకర్యం, గ్యాస్ సమస్యతో నిద్రపట్టదు. కొందరికి పగటి నిద్ర అలవాటు. దీంతో రాత్రి నిద్రపట్టదు.
∙ కుంగుబాటు, రక్తపోటు, నొప్పి నివారణ, బరువు తగ్గించే మందులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగితే మానసిక ఆందోళనతో నిద్రరాదు.
∙ అధిక బరువుతో గురక(స్లీప్ అప్నియా) నిద్రలేమికి కారణమవుతుంది.
∙ స్మోకింగ్, ఆల్కాహాల్ అలవాటు నిద్రలేమిని మరింత ఎక్కువ చేస్తాయి. ఆల్కాహాల్ తీసుకున్న తర్వాత కొద్ది గంటలు నిద్రపట్టినట్లు ఉంటుంది. కానీ.. మత్తు వదిలిన తర్వాత నిద్రపట్టదు.
6–8 గంటలు నిద్రించాల్సిందే..
ఒక్కోసారి విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. తాజాగా కరీంనగర్‌లోని ఓ యువకుడు నిద్రలేమికి చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితికి చేరుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రతీ వ్యక్తికి రోజూ 6–8 గంటలపాటు నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పురుషులే అధికం
మహిళ, పురుçషుల్లో గమనిస్తే పురుషులు 81 శాతం మంది కనీసం 6 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది 6 గ ంటలలోపు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో పురుషులు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.
ఉరుకులు పరుగుల జీవితం
వ్యాపారంలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కష్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి.
– వెన్నం శ్రీనివాస్, వ్యాపారి, కరీంనగర్
ఒత్తిడే ప్రధాన సమస్య
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఏసీ గదుల్లో పనిచేస్తున్నామనే ఆనందమే తప్ప మానసికంగా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వారంవారం షిఫ్టులు మారినప్పుడు నిద్రలేమి సమస్యలు వస్తాయి. కూర్చొని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి.
– జి.సంతోషిణి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఆందోళనలు పక్కనపెట్టాలి
అనవసరపు ఆందోళనలు పక్కన బెట్టి నిద్ర కోసం ఉపక్రమించాలి. మంచి నిద్ర ఉంటేనే తెల్లవారి బ్రెయిన్ చురుకుగా ఉండి పనులు చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఏకాగ్రతతో ఉంటే నిద్ర ఉపక్రమిస్తుంది. – వర్షి, మానసిక వైద్యనిపుణులు, హుజూరాబాద్
మెదడు పనితీరు తగ్గుతుంది
నిద్రలేమి వల్ల మెదడు పనితీరు తగ్గిపోయి మతిమరుపు, ఏకాగ్రత లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ దెబ్బతినడంతో వైరల్స్, బాక్టీరియా వ్యాధులపై శరీరం పోరాడే శక్తి కోల్పోతుంది. రోజూ కనీసం 7–8 గంటలు ప్రశాంతమైన నిద్రపోవడం తప్పనిసరి చేసుకోవాలి.
– డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణులు