
నేటి నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలు
● తిరుపతి– కరీంనగర్ ఎక్స్‌ప్రెస్‌కు మారనున్న బోగీలు ● ఒకప్పుడు నీలి, ప్రస్తుతం పసుపు, రేపటి నుంచి ఎరుపు బోగీలు ● ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ఈ బోగీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి నుంచి తిరుపతి– కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడవనుంది. శనివారం రాత్రి తిరుపతిలో ఎగువ మార్గంలో ఈ రైలు 12761 ఎల్‌హెచ్‌బీ బోగీలతో మొదటిసారిగా కరీంనగర్ వైపు పరుగులు తీయనుంది. ఆదివారం రాత్రి ఇదే రైలు కరీంనగర్ నుంచి తిరుపతికి 12762 ఇదే బోగీలతో దిగువమార్గంలో నడవనుంది. ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ రైలు బోగీల సంఖ్య మొత్తం 19. ఇందులో ఆరు స్లీపర్ బోగీలు, ఐదు తృతీయ శ్రేణి శీతల బోగీలు, రెండు ద్వితీయ శ్రేణి శీతల బోగీలు, నాలుగు సాధారణ (జనరల్ ) బోగీలు, ఒక వికలాంగుల బోగీలతో నడవనుంది. ఈ రైలుకు 12769/70 తిరుపతి– సికింద్రాబాద్– తిరుపతి సెవెన్ హిల్స్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో రేక్ షేరింగ్ ఉంది. కాగా.. తిరుపత్తి– కరీంనగర్ రైలు ఇప్పటి వరకు పసుపు రంగులో ఉండే 22 బోగీలతో నడిచింది. ఇదే రైలు ప్రారంభించిన కొత్తలో నీలి రంగు బోగీలతో నడిచింది.
ఎల్‌హెచ్‌బీ బోగీలు అంటే?
ఎల్‌హెచ్‌బీ అంటే లింక్‌మన్ హాఫ్‌మన్ బుష్ బోగీలు. ఇవి తేలికపాటి స్టీల్‌తో తయారు చేస్తారు. జర్మన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసినవి. మొట్టమొదటి సారి వీటిని మన దేశంలో తీసుకురావాలని అప్పటి దేశ ప్రధాని పీవీ.నరసింహారావు నిర్ణయించారు. ప్రమాదాలు జరిగినపుడు తక్కువ నష్టం జరిగేలా ఈ కోచ్‌లను రూపొందించారు. తొలుత ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం కేవలం రాజధాని లాంటి ప్రీమియర్ రైళ్లకు మాత్రమే ఉపయోగించింది.