
● రహదారి ఆధునికీకరణకు రూ.20 కోట్లు మంజూరు ● తారురోడ్డు
గోదావరిఖని: కార్మికవాడలను అనుసంధానిస్తూ నిర్మించిన కోల్‌కారిడార్ ఆధునికీకరణకు సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యధికంగా కార్మిక కుటుంబాలు ప్రయాణించే ఈ రోడ్డు ప్రమాద భరితంగా మారిందని గుర్తించింది. గోదావరిఖని నుంచి సెంటినరీకాలనీ మీదుగా పెద్దపల్లి వరకు ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ద్విచక్రవాహనదారులు, పెద్దపల్లి, ఓడేడ్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి.
నిత్యం బిజీగా..
పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన కోల్‌కారిడార్ నిత్యం బిజీగా ఉంటోంది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. షిఫ్టు వేళల్లో డ్యూటీలకు వెళ్లే కార్మికులూ ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఈక్రమంలో ఇరుకుగా, గుంతలమయంగా మారిన ఈ కోల్‌కారిడార్‌పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పోతనకాలనీ సమీపంలో రోడ్డు మరింత ఇరుకుగా ఉంది. రాత్రివేళ ప్రమాదాలూ జరుగుతున్నాయి. న్యూమారేడుపాక రైల్వే గేట్‌సమీపంలో చౌరస్తా జంక్షన్ సరిగా లేదు. ఈమేరకు ప్రస్తుతం ఉన్న 7 మీటర్ల వెడల్పులోని తారురోడ్డును 10 మీటర్లకు పెంచి ఆధునికీకరించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.
సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
ఫైవింక్లయిన్ సమీపంలోని గ్యాస్ గోడౌన్ నుంచి ఓల్డ్ సైటాఫీస్ వరకు రోడ్డు వెడల్పు 10 మీటర్లు ఉందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సైటాఫీస్ రోడ్డు నుంచి పోతనకాలనీ మీదుగా ఓసీపీ–1 సైలో బంకర్ వరకు మూడు మీటర్ల వరకు విస్తరించనున్నారు. దీనికోసం యాజమాన్యం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో వాటర్ పైపులైన్లు, టెలిఫోన్, విద్యుత్ పైపులను మార్చడంతోపాటు పోతనకాలనీ కాంపౌండ్‌ను సుమారు ఐదుమీటర్ల మేర వెనక్కి జరపనున్నారు. కొన్నిచోట్ల భూసేకరణ అవసరం ఉంటుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
తారురోడ్డు నిర్మాణానికి రూ.11కోట్లు
కోల్‌కారిడార్ తారు రోడ్డు నిర్మాణం కోసం రూ.11 కోట్లు యాజమాన్యం కేటాయింది. దీనికి వర్క్ అవార్డు పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. గ్యాస్‌గోడౌన్ నుంచి ఓసీపీ–1 సైలో బంకర్ వరకు ఈ నిధులతో రోడ్డును ఆధునికీకరించనున్నారు. ప్రస్తుత రోడ్డు శిథిలమై గుంతలుగా మారింది. రాత్రిపూట ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒకవైపు రోడ్డు బాగుంది. మరోవైపు శిథిమైంది. బాగున్న రోడ్డువైపు ప్రయాణించాలని యత్నిస్తున్న క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అంతర్గత రోడ్ల విస్తరణకు రూ.8కోట్లు..
అత్యధిక కార్మిక కుటుంబాలు నివసిస్తున్న యైటింక్లయిన్‌కాలనీ పట్టణంలో అంతర్గత రోడ్లు శిథిలమయ్యాయి. వీటిని అభివృద్ధి చేసేందుకు సింగరేణి యాజమాన్యం రూ.8 కోట్లు కేటాయించింది.
కోల్‌కారిడార్ రోడ్డు