
పాతది పెంచరు.. కొత్తది ఇవ్వరు
● లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ ● కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? ● దరఖాస్తుదారుల్లో తీరని ఆవేదన
రామగిరి(మంథని): తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2వేలు ఉన్న పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని, దివ్యాంగుల పింఛన్ రూ.6వేలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదంటున్నారు. గతేడాది నిర్వహించిన ప్రజాపాలనలో జిల్లావ్యాప్తంగా 6,979 మంది దివ్యాంగులు, ఇతరులు 49,552 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందున్న ప్రభుత్వం 2022లో ఒకసారి మా త్రమే కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వారు అంటున్నారు.
16 నెలలుగా పాత పింఛనే..
జిల్లాలోని పింఛన్‌దారులకు పాతపింఛన్ సొమ్మే విడుదలవుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా కొత్త పింఛన్ల గురించి పట్టించుకోవడం లేదని వారు దుయ్యబడుతున్నారు.
మూడేళ్లుగా ఎదురుచూపులే..
జిల్లాలో కొత్త పింఛన్ కోసం మూడేళ్లుగా అర్హులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో కొత్త పింఛన్ మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడి చేసినా దరఖాస్తుల స్వీకరణకే పరిమితం అయిందనే విమర్శిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ విషయంలో మాత్రం ఒకరు మరణిస్తే మరొకరికి ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇలా 6,606 మంది మరణించగా బదాలయింపు పింఛన్లు 2,249 మందికి మంజూరు చేశారు.
జిల్లాలో పింఛన్లు
వృద్ధాప్య 40,884
వితంతు 32,903
దివ్యాంగ 13,068
చేనేత 806
గీతకార్మిక 2,187
బీడీకార్మిక 695
ఒంటరి మహిళ 2,613
టేకేదార్ 5
పైలేరియా బాధిత 338
డయాలసిస్ బాధిత 83
ఇతరులు 1,253