పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’ | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’

May 7 2025 12:04 AM | Updated on May 7 2025 12:04 AM

పైసలి

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’

● సింగరేణిలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ దందా ● దృష్టి సారించిన విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు ● కొత్తగూడెంలో ఏసీబీ వలకు చిక్కిన పెద్దచేప ● లోతుగా కూపీలాగుతున్న అఽధికారులు ● అప్రమత్తమైన సింగరేణి యాజమాన్యం

గోదావరిఖని: సింగరేణిలో కార్మికుల మెడికల్‌ అన్‌ఫిట్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దళారులు రంగ ప్రవేశం చేసి ఒక్కో కార్మికుడి నుంచి రూ.6 లక్షల నుంచి రూ. 8లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు, మెడికల్‌ బోర్డులో దందాను అరికట్టేందుకు సింగరేణి సీఎండీ బలరాం కొత్తగూడెంలో ఏసీబీ డీఎస్పీస్థాయి అధికారిని నియమించారు. అవినీతిని అరికట్టేందుకు నిఘా పెట్టాలని ఏసీబీ ఐజీకి సీఎండీ విజ్ఞప్తి చేశారు. మొదట్లో దళారీ వ్యవవస్థ వెనుకడుగు వేసినా.. ప్రస్తుతం మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కమిటీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారసులను ఉద్యోగంలోకి తీసుకునేలా కార్మికులను మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలా కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ములో పైరవీదారుకు రూ.లక్ష, మిగతా సొమ్ము అధికారులకు తలాకొంత పంచుతున్నారని అంటున్నారు. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కాకుంటే ఖర్చుల కోసం రూ.లక్ష ఉంచుకుని, మిగతా సొమ్ము వాపస్‌ ఇస్తున్నారు. కొందరైతే వాపస్‌ ఇవ్వకపోవడంతో చాలాచోట్ల పంచాయితీలు ఠాణా వరకూ వెళ్తున్నాయి.

పట్టుబడిన అవినీతి తిమింగళం

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పేరిట దందాకు పాల్పడుతున్న ఓ నాయకుడిని కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ మంగళవారం అదుపులోకి తీసుకోవడం, బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి వరకు లావాదేవీలు సాగినట్లు గుర్తించడంతో దందా మళ్లీ ఊపందుకున్నదానికి బలం చేకూర్చినట్లయ్యింది. దందాలో అన్ని ఏరియాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్‌ దందాలోని సదరు నేతకు అన్ని ఏరియాలతో లింక్‌లు ఉన్నట్లుగా సమాచారం. యా జమాన్యం ఈవిషయంలో లోతుగా ఆరా తీస్తోంది. గతంలో కొత్తగూడెం ప్రాంతంలో పనిచేసిన ఓ అధికారి విషయంలో కూడా సీరియస్‌ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

దందా ఎందుకు సాగుతోంది?

సింగరేణి కార్మికుల వారుసులకు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌తో కారుణ్య నియామాల ద్వారా ఉద్యో గం ఇస్తున్నారు. ఇందుకోసం కొత్తగూడెం ప్రధా న కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీనెల సుమారు 200 మంది వరకు మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేస్తున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు ఉండి, కచ్చితమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అర్హులు. వీటిని ఆసరాగా చేసుకుంటున్న పైరవీకారులు.. తాము చెప్పిన వారికే మెడికల్‌ బోర్డులో ఇన్వాలిడేషన్‌ అవుతుందని, లేకుంటే అదే ఉద్యోగం చేయాల్సి వస్తుందని, ఈలోగా రెండేళ్ల గడువు తీరిపోతుందని కార్మికులను బెదిరిస్తూ దరఖాస్తుదారులతో బేరసారాలకు దిగుతున్నారు. వీరిలో 80 శాతం మంది కార్మికులు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ సక్సెస్‌కావడంతో సహజంగానే లంచం ఇచ్చుకుంటున్నారు. అయితే, సింగరేణి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అవినీతి ఆగడంలేదు.

యాజమాన్యం తీరుతోనే..

కొందరు కార్మికులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగినా, మరికొందరిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లినా మెడికల్‌ అన్‌ఫిట్‌ చేసేందుకు డాక్టర్లు నిరాకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ముట్టజెప్పి, దర్జాగా నడుచుకుంటూ వెళ్లేవారిని అన్‌ఫిట్‌ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా బోర్డు అనుసరిస్తున్న తీరుపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈక్రమంలోనే తాము మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయి తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలనే ఆశతో కార్మికులు తప్పుదారి ఎంచుకుంటున్నారు.

రెండేళ్ల నిబంధన తొలగిస్తే..

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌కు సర్వీసు కనీసం రెండేళ్లు ఉండాలనేది కంపెనీ నిబంధన. దీనిని తొలగిస్తే దందా నిలిచపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలోనే కాకుండా రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలోనూ మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు. తద్వారా కార్మికుల్లో భయం తొలగిపోతుందంటున్నారు.

పారిశ్రామిక ప్రాంతంలో దందా

రామగుండంప్రాంతంలో మెడికల్‌ దందా జోరు గా సాగుతోంది. దళారులు ఏజెంట్లను నియమించుకుని మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చేయిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెద్దమొత్తంలో వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఎవరినీ నమ్మొద్దు

సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మవద్దు. ఇలాంటి వారి సమాచారాన్ని విజిలెన్స్‌కు చేరవేయాలి. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. దళారులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఏసీబీ, సింగరేణి విజిలెన్స్‌తో నిఘా కొనసాగుతోంది.

– బలరాం, సీఎంఈ, సింగరేణి

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’1
1/2

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’2
2/2

పైసలిస్తేనే ‘అన్‌ఫిట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement