పౌర సేవలపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పౌర సేవలపై పట్టింపేది?

Mar 14 2025 1:45 AM | Updated on Mar 14 2025 1:43 AM

● మున్సిపాలిటీల్లో అటకెక్కిన సిటిజన్‌ చార్ట్‌ ● బల్దియాల్లో ఆన్‌లైన్‌ ఫిర్యాదులపై స్పందన కరువు ● అవగాహన లేక, పరిష్కారం కాక ఆసక్తి చూపని పట్టణవాసులు

రామగుండం కార్పొరేషన్‌లోని

మార్కండేయకాలనీకి చెందిన వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలు కావొస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో నేరుగా కార్యాలయంకు వెళ్లి తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు.

మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఓ వ్యక్తి భవన

నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోరుతూ

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజులు గడిచినా అనుమతులు రాకపోవడంతో నేరుగా కార్యాలయానికి వెళ్లి విచారించారు. అసలు ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవని తెలిసి, ప్రత్యక్షంగా కార్యాలయంలో

దరఖాస్తు సమర్పించారు.

సాక్షి, పెద్దపల్లి:

సర్‌.. మా గల్లీలో నీళ్లు సక్రమంగా రావడం లేదు.. మా కాలనీలో రోడ్డు బాగాలేవు.. గుంతలు పూడ్చా లి.. వీధి దీపం వెలగట్లేదు.. ఇలా రోజూ వస్తున్న ఫిర్యాదులపై సత్వర పరిష్కారం గగనమైంది. ఒకే చోట.. సత్వరం.. సులభతరంగా పౌరసేవలు అందేలా మున్సిపాలిటీల్లో సిటిజన్‌ చార్టర్‌ ప్రవేశపెట్టా రు. అమలు చేయకుంటే జవాబుదారీతనం ఉండేలా అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధించేలా చట్టం రూపొందించారు. పౌరసేవలకు వచ్చేసరికి నెలల తరబడి ఆలస్యం అవుతోంది. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో సిటిజన్‌ చార్ట్‌ అమలు, పరిష్కారం, జాప్యంపై సమీక్షల్లేవు. నిబంధనల ప్రకారం నెలకు రెండుసార్లు సిటిజన్‌ చార్టర్‌ అమలు, పెండింగ్‌ ఫైల్స్‌, పౌరసేవలపై కమిషనర్‌ సమీక్ష చేయాలి. ఈ విధానం ఎక్కడ అమలు కావడం లేదు. దీనిని అలుసుగా తీసుకొని ఉద్యోగులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సిటిజన్‌ చార్టర్‌ అటకెక్కింది.

అవగాహన శూన్యం

జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలో ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్ర జలు నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చే యాల్సి వస్తోంది. ‘సిటిజన్‌ బడ్డీ యాప్‌’ పట్టణ ప్ర జలకు అందుబాటులో ఉన్నా దీనిపై మున్సిపల్‌ అ ధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. సిటిజన్‌ చార్టర్‌ సేవలపై క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేక నీరుగారిపోతోంది. కొందరు విద్యావంతులు ఆన్‌లైన్‌లో వినతులు ఇస్తున్నా అధికారులు వాటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిటిజన్‌చార్ట్‌ అమలుపై ఆయా మున్సిపల్‌ కమిషనర్లను వివరణ కోరగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏ పని ఎన్ని రోజుల్లో చేయాలి

భవన నిర్మాణ అనుమతి 21

కొత్త లేఅవుట్‌ అనుమతి 30

కొత్త కుళాయి కనెక్షన్‌ 15

ట్రేడ్‌ లైసెన్సుల జారీ 07

కొత్త ఇంటి నంబరు 15

ఆస్తి పేరు మార్పిడి(ఇతరాలైతే) 30

ఆస్తి బైఫర్‌కేషన్‌ 30

పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం 05

మరణ ఽధ్రువీకరణ పత్రం 07

పాత రికార్డుల పత్రాలు 07

ఈ ఏడాదిలో ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులు

మున్సిపాలిటీ వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించినవి

పెద్దపల్లి 02 02

మంథని 06 04

సుల్తానాబాద్‌ 116 98

రామగుండం 445 310

పౌర సేవలపై పట్టింపేది?1
1/1

పౌర సేవలపై పట్టింపేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement