
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
గోదావరిఖని: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషనరేట్‌లో బుధవారం బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో ఆయన సమావేశమైయ్యారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు స్థానిక పరిస్థితుల గురించి పైఅధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బంది, అధికారులను గుర్తించి రివార్డులు అందజేస్తామన్నారు. ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని, అనుక్షణం వారికి అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ వర్టికల్స్ ఇన్‌చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని/రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తొలుత రామగుండం రైల్వేస్టేషన్, పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. అనంతరం గోదావరిఖని బస్టాండ్‌లో సోదాలు చేశారు. ప్రయాణికుల భద్రత తదితర విషయాల గురించి ఆరా తీశారు. పెట్రోలింగ్, గస్తీ పోలీసుల పనితీరును ఆయన పరిశీలించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా