
జగిత్యాలజోన్: ఎన్నికల పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటరు గోప్యతను పాటించకుండా ఓటును బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు భావించి సదరు వ్యక్తి ఓటును వేయడానికి అనుమతించరు. అలాగే గుడ్డివారై ఉండి, ఎన్నికల గుర్తులను గుర్తించలేని పరిస్థితి ఉంటే, సదరు ఓటు వేసే అంధత్వ వ్యక్తితో పాటు ఓ వ్యక్తిని పోలింగ్ బూత్‌లోకి అధికారులు అనుమతిస్తారు. అంధత్వ వ్యక్తికి సహాయంగా వెళ్లే వ్యక్తికి 18 ఏళ్లు నిండి, ఏదేని గుర్తింపు కార్డు తీసుకవస్తేనే పోలింగ్‌కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి ఓటును అప్పటికే ఎవరైనా వేస్తే, టెండర్ ఓటుగా పరిగణించి, పోలింగ్ అధికారుల వద్ద ఉండే బ్యాలెట్ పేపర్‌లో ఒక పేపర్ ఇస్తే, దానిపై పాత పద్ధతిలో ఓటు వేయవచ్చు. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బోగస్ ఓటు అని, తక్కువ వయస్సు అని పోలింగ్ ఎజెంట్లు చాలెంజ్ చేస్తే, పోలింగ్ అధికారి ఏజెంట్ నుంచి విషయాలు సేకరిస్తారు. ప్రాథమిక విచారణ జరిపి, ఆరోపణ నిజమైతే సదరు ఓటర్‌ను పోలీస్ సిబ్బందికి అప్పగిస్తారు. ఒక ఓటర్ తాను నచ్చిన పార్టీకి ఓటు వేస్తే, అది వేరే పార్టీకి పడ్డట్లు ఆరోపణలు చేస్తే, అధికారులు టెస్ట్ ఓటుకు అనుమతిస్తారు. అయితే ఆ ఆరోపణ రుజువు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా సదరు ఓటర్‌ను ముందే హెచ్చరిస్తుంటారు.
ఉల్లంఘిస్తే ఓటు వేయకుండా చర్యలు