గోదావరిఖని: బతుక మ్మ, దసరా, దీపావళి పండుగల కోసం అ వసరమైన దుస్తులు, ఆహార పదార్థాలు, ఇంటి సామగ్రి తదితరాలు కొనుగోలు చేస్తామనే సింగరేణి కార్మికుల ఆశలు ఆవిరి అయ్యాయి. లాభాల బోనస్, దీపావళి అడ్వాన్స్ చెల్లింపులపై ఎన్నికల కోడ్ ప్రభావం ఇందుకు కారణమైంది. కొత్తబట్టలు, బంధువుల రాక, అనేక ఆశల మధ్య దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని కార్మికులు ఆశపడ్డారు. కానీ, ఎన్నికల కోడ్ అడ్డుగా రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నేడు చెల్లించాల్సి ఉంది..
● వాస్తవానికి కార్మికులకు లాభాల వాటాను సోమవారం చెల్లించాల్సి ఉంది.
● ఈనెల 20న రూ.25వేల దసరా అడ్వాన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంది.
● లాభాల వాటాపై ఈనెల 4న సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.
● తద్వారా ఈసారి యాజమాన్యం సాధించిన వాస్తవ లాభాల్లోంచి 32శాతం కార్మికుల వాటాగా రూ.711కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంది.
● కానీ, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
● తద్వారా నిబంధనలు అతిక్రమించే వారిపై ఎన్నికల కమిషన్ కొరడాఘుళిపిస్తోంది.
● ఈక్రమంలో లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌ను విన్నవించేందుకు సింగరేణి యాజమాన్యం యత్నిస్తోంది.
● ఇప్పటికే సంస్థ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్‌ను సంప్రదించారు.
ఏటా చేయాల్సిన చెల్లింపులే..
సింగరేణి సాధించే లాభాల్లోంచి వాటా, దీపావళి బోనస్, దసరా అడ్వాన్స్‌ను ఏటా కార్మికులకు చెల్లి స్తూ వస్తోంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 42వేల మంది కార్మికులకు ఈసొమ్మును యాజమాన్యం అంది స్తోంది. ప్రధానంగా పండుగ కావడంతో కొత్తవస్త్రాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఉద్యోగులు ఈ సొమ్ము వెచ్చిస్తున్నారు. కొందరు తమ పిల్లల స్కూల్, కాలేజీ ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు. ఈసారి చెల్లింపులపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండడంతో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.
పండుగ సామగ్రి తెచ్చుకునేదెలా?
లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపులపై ఎన్నికల కోడ్
ఎప్పటిలాగే చెల్లించాలంటున్న కార్మిక సంఘాల నాయకులు
ఎలక్షన్ కమిషన్‌తో సంప్రదిస్తున్నామంటున్న యాజమాన్యం


