
పనులు ప్రారంభించలే
రూ.2కోట్లున్నా.. ప్రారంభానికి నోచుకోని భవన నిర్మాణం ల్యాబ్ గదుల్లోనే బాలికల జూనియర్ కాలేజీ నిర్వహణ సొంతభవనం లేక విద్యార్థినులు, అధ్యాపకుల ఇబ్బందులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు.. తప్పని అవస్థలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీకి సొంతభవనం లేదు. బాలుర, బాలికల జూనియర్ కాలేజీ ల్యాబ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఐదు కోర్సులు అందుబాటు ఉండగా 230 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 14మంది అధ్యాపకులు విద్యా బోధన చేస్తున్నారు. బాలికల కాలేజీ ప్రిన్సిపాల్ ఈఏడాది జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. బాలుర కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగించారు.
సీఎం శంకుస్థాపన చేసి ఏడాది..
బాలికల జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాదాపు ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు మొదలే కాలేదు. పాత భవనం కూల్చి కొత్తభవనం పనులు ప్రారంభించే సమయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వాకర్స్‌కు అనువుగా ఉండేలా చూడాలని విన్నవించారు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థినుల తరగతులను బాలికల జూనియర్ కాలేజీకి చెందిన మూడు, బాలుర కాలేజీకి చెందిన మరో 3 ల్యాబ్ గదుల్లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 కోట్లతో పనులు చేపడితే ఇప్పటికే భవనం పూర్తయ్యేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మల, మూత్ర విసర్జనకు తిప్పలే..
ల్యాబ్ గదుల్లో తరగతులు నిర్వహిస్తుండగా విద్యార్థినులు, అధ్యాపకులకు అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. పాత మరుగుదొడ్లకు మరమ్మతులు చేసుకుని వాటినే విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు వినియోగించుకుంటున్నారు. పురుష అధ్యాపకులతోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకటి, రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులే నెలకొని ఉన్నాయి.
రూ.20లక్షలతో తాత్కాలిక మరమ్మతులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని లాబోరేటరీ గదులు వర్షాలకు ఉరుస్తుండడం, ఫ్లో రింగ్ కుంగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులను రూ.20లక్షల అంచనాలతో చేపట్టారు. ఇదివరకున్న ఫ్లోరింగ్ తొలగించి సిమెంట్‌తో ఫ్లోరింగ్ చేపట్టినా నాసిరకంగా సాగుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నా యి. అధికారులు పర్యవేక్షించి పనులు నాణ్యవంతంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.

పనులు ప్రారంభించలే