
శాస్త్రులపల్లి గ్రామం
కొండపల్లి స్ఫూర్తితో ఉద్యమ బాట
మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధి శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాధమ్మ(రాజమ్మ)–వెంకట్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజిరెడ్డి, చిన్న కొడుకు భీమా రెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. 1975లో గ్రామంలో జరిగిన ఓ సంఽఘటనలో రాజిరెడ్డిపై కేసు నమోదై, జైలుకు వెల్లాడు. వరంగల్ జైలులో ఉన్న సమయంలో పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన కొంతమందితో పరిచయం ఏర్పడింది. జైలు జీవితం అనంతరం ఆయన కొండపల్లి స్ఫూర్తితో ఉద్యమ బాట పట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సింగరేణి ఉద్యోగం కాదని..
రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు భీమారెడ్డికి సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాలని తండ్రి వారికి సూచించారు. కానీ రాజిరెడ్డి తనకు వచ్చిన కాల్ లెటర్‌ను చించేసి, విప్లవోద్యమం వైపు వెళ్లాడు. ఆయన సోదరుడు మాత్రం సింగరేణి ఉద్యోగం చేసి, విరమణ పొందాడు.
మేనమామ కూతురితో వివాహం
రాజిరెడ్డి తన మేనమామ రామగిరి(అప్పడు ముత్తారం) మండలంలోని రామయ్యపల్లికి చెందిన మట్ట కృష్ణారెడ్డి కూతురు రత్నమ్మను వివాహం చేసుకున్నాడు. రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత పోలీసుల వేధింపులు పెరగడంతో ఆమె సైతం 1982లో పీపుల్స్‌వార్ పార్టీలోకి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అక్కడే వారికి కూతురు స్నేహలత జన్మించడంతో ఆరేళ్ల వయసులో పాపను సోదరుడి చేతిలో పెట్టారు. ఆయన పెంచి పెద్దచేసి, చదివించాడు. తీవ్ర నిర్బంధంలో ఎవరూ రాలేని పరిస్థితిలో మంథనిలోని ఎకరన్నర భూమిని అమ్మి, మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లిలో ఆమెకు కాసీం అనే వ్యక్తితో వివాహం జరిపించారు. స్నేహలత న్యాయవాదిగా పని చేస్తున్నట్లు తెలిసింది. రత్నమ్మ మరణించిన తర్వాత రాజిరెడ్డి అజ్ఞాతంలోనే బీచ సుగుణ ఉరఫ్ సంగీతను వివాహం చేసుకున్నట్లు సమాచారం.
తల్లిదండ్రుల కడసారి చూపునకు రాలే..
రాజిరెడ్డి తండ్రి 25 ఏ ళ్ల క్రితం చనిపోయా రు. పోలీస్ నిఘా తీవ్రంగా ఉండటంతో ఆయన తన తండ్రిని కడసారి చూసుకునేందుకు రాలేకపోయారు. తల్లి రాజమ్మ 2013లో అనారోగ్యంతో మృతిచెందగా అప్పుడూ రాలేదు. కానీ రెండు నెలల మాసికం రోజు సమీపంలోని అటవీ ప్రాంతానికి వచ్చి, తన కుటుంబసభ్యులను పిలిపించుకొని మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
రెండుసార్లు అరెస్టు..
31–01–1950లో జన్మించిన మల్లా రాజిరెడ్డి రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1988లో ధర్మపురిలో తొలిసారి, 2007 డిసెంబర్ 14న కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం పట్టణం ఎస్‌ఆర్ ప్లాజా వద్ద రెండోసారి అరెస్టయ్యారు. 18 నెలల జైలు జీవితం గడిపిన రాజిరెడ్డి మళ్లీ 2009 అక్టోబర్ 7 అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఆయన అనే క సంఘటనల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రసు ్తతం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర, ఒడిశా బార్డర్ దండకారణ్య సెక్రటరీగా ఉన్నట్లు సమాచారం. రాజిరెడ్డిపై మహదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసుతోపాటు కరీంనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసు నమోదయ్యాయి. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 9, దేశ వ్యాప్తంగా 40కి పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. ఆయనపై రాష్ట్రంలో రూ.25 లక్షలు, ఆయా రాష్ట్రాల్లో మరో రూ.75 లక్షల నజరానా ఉంది.
యాభై ఏళ్ల కింద చూసిన
నేను వయస్సులో ఉన్నప్పుడు రాజిరెడ్డి చిన్నోడు. అన్నలల్లకు పోకముందు మా ఇంటికి వచ్చేటోడు. అందరం కలిసిమెలిసి ఉండేటోళ్లం. యాభై ఏళ్ల కింద పోయిన మనిషి మల్లా రాలేదు నేను చూడలేదు. తల్లిదండ్రులు బాగా బాధపడటోళ్లు.
– నాసారపు లచ్చన్న, శాస్త్రులపల్లి

మంథని కోర్టులో హాజరుపర్చేందుకు రాజిరెడ్డిని తీసుకొస్తున్న పోలీసులు(ఫైల్)

రాజిరెడ్డి ఇంటి వద్ద గ్రామస్తులు

రోదిస్తున్న రాజిరెడ్డి మరదలు సరోజన
