మిల్లర్లకు గడువు గండం..! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లకు గడువు గండం..!

May 31 2026 12:36 AM | Updated on May 31 2026 12:36 AM

ఒక రోజు సమయం ఉంది కదా...

మరపట్టిన బియ్యం ప్రభుత్వానికి

ఇచ్చేందుకు నేటితో ముగియనున్న గడువు

తొలుత బియ్యం సేకరణలో జాప్యం...?

గడువు ఒకరోజే ఉండడంతో మిల్లర్లలో ఆందోళన

వీరఘట్టం/పాలకొండ:

వీరఘట్టంలోని ఓ రైస్‌ మిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు ఇవి. గత ఖరీఫ్‌లో ఈ మిల్లుకు 19,477 క్వింటాళ్ల ధాన్యంను మిల్లింగ్‌ చేసేందుకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ధాన్యంలో 13,050 క్వింటాళ్ల (67 శాతం) బియ్యం తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు ఆ మిల్లరు 10,150 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 2,900 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉంది. ఆదివారంలోగా మిగిలిన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు.

తేడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 2,72,119 మెట్రిక్‌ టన్నుల ధాన్యంను రైతుల వద్ద కొనుగోలు చేసింది. వీటిని బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన జిల్లాలోని 113 మిల్లులకు మరపట్టించేందుకు అప్పగించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో 67 శాతం బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాలి. మిల్లింగ్‌ చేసినందుకు ప్రభుత్వం మిల్లరుకు చార్జీలు ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం 1,82,319 మెట్రిక్‌ టన్నులు కాగా.. శనివారం నాటికి 1,68,819 మెట్రిక్‌ టన్నులు బియ్యం ఇచ్చేశారు. ఇంకా 13,500 మెట్రిక్‌ టన్నులు బియ్యం మే 31లోగా ఇవ్వాల్సిందేనని నిబంధనలు పెట్టడంతో మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త సమయం ఇస్తే మిగిలిన బియ్యం ఇచ్చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు.

ఏం జరిగింది....

ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంత ఆలస్యంగానే జరిగింది. ఫిబ్రవరి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. మిల్లరు వద్ద ఉన్న ధాన్యంను మరపట్టించేందుకు ప్రభుత్వం నుంచి సకాలంలో అనుమతులు రాకపోవడంతో మిల్లింగ్‌ చేయడంలో జాప్యం జరిగిందని మిల్లర్లు చెబుతున్నారు. అందుచే తమ వద్ద ఉన్న ధాన్యంను మరపట్టి ప్రభుత్వానికి ఇచ్చేందుకు మరి కొంత సమయం కావాలని గడువు కోరుతున్నారు.

బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు....

వాస్తవానికి ఏటా ఖరీఫ్‌లో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం మరపట్టి, ప్రభుత్వానికి బియ్యం ఇచ్చే ప్రక్రియ మార్చి లేదా ఏప్రిల్‌ నెలాఖరకు పూర్తయ్యేది. మిల్లరుకు ఫోర్టిఫైడ్‌ రైస్‌ను ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వానికి మిల్లరు ఇచ్చే బియ్యంలో ప్రతి క్వింటాకు 1 శాతం ఈ ఫోర్టిఫైడ్‌ రైస్‌ను కలిపి ప్రభుత్వానికి ఇచ్చేవారు. అయితే, ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఈ ఏడాది రావడం ఆలస్యం కావడంతో మిల్లింగ్‌ చేయడం ఆలస్యం అయ్యింది. చివరకు ఫోర్టిఫైడ్‌ రైస్‌ కొరత ఉండడంతో చివరికి మిల్లింగ్‌ చేసిన బియ్యమే ఇవ్వాల్సి వచ్చింది. దీనికి తోడు జిల్లాలోని పౌర సరఫరాల శాఖ గోదాంలలో ఖాళీ లేకపోవడంతో మిల్లింగ్‌ కొన్ని రోజుల పాటు ఆగిపోయిందని మిల్లర్లు అంటున్నారు. ఇలా అనేక కారణాలతో మిల్లింగ్‌కు తీవ్ర జాప్యం జరిగిందని, అందుకే బియ్యం సేకరణకు గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు.

తీవ్ర నష్టం

మిల్లింగ్‌లో జాప్యం జరిగింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పూర్తిగా డ్రై కావడంతో ప్రతి క్వింటాకు నాలుగు కిలోల ధాన్యం తరుగు వచ్చినట్లు మిల్లర్లు చెబుతున్నారు. దీనికి తోడు కళాసీల కొరత వెంటాడుతోందని, అన్ని విధాలా నష్టాలే కనిపిస్తున్నాయని వాపోతున్నారు.

ఈ ఏడాది ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన 2,72,119 మెట్రిక్‌ టన్నుల ధాన్యంను మిల్లర్లకు ఇచ్చాం. ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల బియ్యం సేకరణలో జాప్యం జరిగింది. ఆదివారంతో మరపట్టిన బియ్యం ఇచ్చేందుకు గడువు ముగియనుంది. ఇంకా ఒక్కరోజు సమయం ఉంది కావున మిల్లర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.

– శ్రీనివాసరావు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌, పార్వతీపురం మన్యం

ఇవి పాలకొండలోని ఓ రైస్‌ మిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలుచేసిన ధాన్యంలో 17,313 క్వింటాళ్ల ధాన్యంను మిల్లింగ్‌ చేసేందుకు మిల్లర్‌కు ఇచ్చింది. ధాన్యంలో 11,600 (67 శాతం) క్వింటాళ్ల బియ్యం తిరిగి ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఆ మిల్లరు 10,150 క్వింటాళ్ల బియ్యంను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 1,450 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement