ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సమన్వయకర్తగా జామి | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సమన్వయకర్తగా జామి

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన విద్యాసాగర్‌ జామి ప్రసాదరావును శ్రీశ్రీ కళావేదిక 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సమన్వయకర్తగా నియమించారని ఆయన సోమవారం తెలిపారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీలో వచ్చే నెల 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ మేరకు కళావేదిక జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరి భూషణం, డాక్టర్‌ టి.పార్థసారథిలు నియామక ఉత్తర్వులు అందజేశారని తెలిపారు. దేశవిదేశాల నుంచి కవులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి తనను సమన్వయకర్తగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తాను రాసిన వివిధ సాహిత్య పుస్తకాలు ఈ సభల్లో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన నియామకంపట్ల జెడ్పీటీసీ బండి నర్సింహులు, అప్పటి పదో తరగతి స్నేహితులు, బొద్దాం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

25 తులాల బంగారం చోరీ

పూసపాటిరేగ: మండలంలోని చల్లవానితోట యాతపేటలో 25 తులాల బంగారం చోరీకి గురైనట్లు భోగాపురం రూరల్‌ సీఐ జి. రామకృష్ణ తెలియజేశారు. గ్రామానికి చెందిన రీసు రామారావు, ఇంట్లో ఈనెల 17 ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతుకుడు వచ్చి బీరువా పగలగొట్టి బంగారం దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. 6 బంగారం గాజులు, 2 హారాలు, 1 నల్లపూసల దండ, 4 రింగులు, 1 బ్రాస్‌లెట్‌ కలిసి సుమారు 25 తులాల వరకు దొంగతనం జరిగినట్లు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్‌ టీం నిపుణులతో భోగాపురం రూరల్‌ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ, డెంకాడ ఎస్సైలు ఐ. దుర్గాప్రసాద్‌, ఎ.సన్యాసినాయుడులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. సమీపంలో సీసీ ఫుటేజీతో పాటు సాంకేతికతను ఉపయోగించి రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.

కోళ్ల ఫారం దగ్ధం

మెంటాడ: మండలంలోని జక్కువ గ్రామంలో కోట అప్పుడుకు చెందిన కోళ్ల ఫారం దగ్ఢమై సుమారు రూ. రెండు లక్షల 70వేల వరకు నష్టం వాటిల్లింది. పదిహేను రోజుల క్రితం కోళ్లను తరలించడంతో పెద్ద నష్టం తప్పింది. దగ్గరలో గల పొలంలో పెట్టిన మంట నిప్పు రవ్వలు ఎగిరి కోళ్ల ఫారం మీద పడడం వల్ల ఈ ప్రమాద జరిగినదని అగ్నిమాపక సిబ్బంది అన్నారు.

చికిత్స పొందుతూ

యువకుడి మృతి

నెల్లిమర్ల రూరల్‌: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండలంలోని గుషిణి గ్రామానికి చెందిన చందక తేజా నాయుడు(16) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై ఎస్సై గణేష్‌ మాట్లాడుతూ..గుషిణి సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న అబ్దుల్‌ రహీమ్‌తో కలిసి తేజానాయుడు ఈ నెల 12న స్కూటీపై ప్రయాణిస్తుండగా చనమల్లు పేట సమీపంలో బైక్‌ అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారన్నారు. ఈ ఘటనలో తేజానాయుడు తలకు తీవ్ర గాయమైందని..తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలోను అనంతరం ప్రైవేట్‌ ఆసుపత్రిలోను చికిత్స పొందాడన్నారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం జెమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని చెప్పారు. అబ్దుల్‌ రహీమ్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం

పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలస గ్రామ పంచాయతీ పరిధిలో ఓ సాగునీటి వాగు ఆక్రమణకు గురైందన్న విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి అనురాధ..సోమవారం క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమిత ప్రదేశాన్ని పరిశీలించారు. దాదాపు నాలుగున్నర సెంట్ల వాగు ప్రాంతాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement