పంపాం.. మళ్లీ వచ్చేశారు..
● అయోమయంలో కాల్ సెంటర్ సిబ్బంది ..! ● సిబ్బందిని జెడ్పీకి పంపిన అధికారులు ● మళ్లీ వెనక్కి వచ్చేసిన వైనం
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు అంతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్ర న్న బీమాకు టీడీపీ సర్కార్ పూర్తిగా మంగళం పాడేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రన్న బీమా పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన చంద్రన్న కాల్ సెంటర్ సిబ్బంది అయోమయంలో కొట్టుమిట్టుడుతున్నారు. చంద్రన్న బీమా పథ కం అమలులో లేకపోవడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ పథకంలో పని చేసే నలుగురు ఉద్యోగులను డీఆర్‌డీఏ అధికారులు జిల్లా పరిషత్‌కు పంపించారు. అక్కడ ఆరు నెలలు పాటు పని చేసిన మీదట తిరిగి డీఆర్‌డీఏకు ఇటీవల వచ్చేశారు. అధికారులు కూడా వారిని ఏ విధంగా వినియోగించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలియవచ్చింది. చంద్రన్న బీమా పథకం అమలులో కాల్ సెంటర్ సిబ్బందికి పని ఉంటుంది. బీమా ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు నుంచి వచ్చిన ఫోన్లు స్వీకరించడం, వారికి బీమా వర్తింపజేయడానికి అవసరమైన పత్రాలు స్వీకరించడం, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇప్పడు బీమా అమల్లో లేకపోవడంతో అక్కడ వారికి పని లేక పోయింది. వేరే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి.
చంద్రన్న బీమా కాల్ సెంటర్‌లో పని చేసే నలుగురిని జెడ్పీకి ఆరు నెలలు కిందట పంపించాం. తిరిగి వారు ఇటీవల తిరిగి వచ్చేశారు. వారు డీఆర్‌డీఏలో పని చేస్తున్నారు.
– శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ


