నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించి శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో హోమం, కుంకుమ పూజలు జరిపించారు.
● గ్యాస్ ఏజెన్సీ ముట్టడి
విజయనగరం రూరల్: పట్టణంలోని స్వామి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని వినియోగదారులు బుధవారం ముట్టడించారు. గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా స్వామి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్ల వద్ద సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడౌన్ వద్ద సిలిండర్లు తీసుకోవాలని చెబుతుండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిర్వాహాకులు గ్యాస్ కంపెనీకి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సిలిండర్ల సరఫరా ఆగిపోయిందని గుర్తించిన తహసీల్దార్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహాకులతో మాట్లాడి డబ్బులు చెల్లింపజేశారు. దీంతో రెండు, మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా అయ్యేలా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వినియోగదారులు వెనుదిరిగారు.


