సాక్షి, పార్వతీపురం మన్యం: టిడ్కో ఇళ్ల మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించడంలో చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. చాలా వరకూ నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అప్పుడే బీటలు వారుతున్నాయి. దీంతో ఏళ్లుగా సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశా మిగులుతోంది. 2017లో ఈ పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నిర్మాణాలు చేయకుండానే వదిలేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ఈ నిర్మాణాలను చాలా వరకూ పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహాలు అందజేయాల్సి ఉన్నా.. కాలయాపన చేస్తున్నారు.
● పార్వతీపురంలో 1,104, సాలూరులో 1,440 గృహాలు మంజూరయ్యాయి. వీటికోసం లబ్ధిదారుల వాటాగా వారి నుంచి కొంత మొత్తం డీడీల రూపంలో వసూలు చేశారు. మంజూరుచేసిన ఇళ్లలో కొన్ని రద్దు చేశారు. వారికి ఇప్పటివరకూ డీడీలు చెల్లించలేదు.
● పార్వతీపురంలో టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. డ్రైన్లు, రక్షణ గోడలు, పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.
● సాలూరులో గృహాల సముదాయం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. సుమారు వెయ్యికి పైగా ఇళ్లను పూర్తి చేసి, అట్టహాసంగా లబ్ధిదారులతో ప్రారంభోత్సవాలు కూడా చేశారు. మిగిలి ఉన్న నిర్మాణాలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా టిడ్కో గృహాల వద్ద వైర్లు, పరికరాలు చోరీకి గురవుతున్నాయి.
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
టిడ్కో ఇళ్ల అప్పగింతలో ప్రభుత్వం, అధికారపక్ష నేతలు చేస్తున్న అలసత్వానికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మంగళవారం ఉదయం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్ట డించారు. ఇక్కడ 1,402 మందిని లబ్ధిదారులుగా గుర్తించి, 768 ఇళ్ల నిర్మాణం 90 శాతానికి పైగా పూర్తిచేసినా వాటిని లబ్ధిదారులకు అప్పగించలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వద్ద నుంచి వసూలు చేసిన షేర్ కాపిటల్ డబ్బులు కోటి 36 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వా లని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన మున్సిపల్ కమిషనర్.. ధర్నా చేస్తున్న బాదితుల వద్దకు వచ్చి సమస్యలను వి న్నారు. జూన్ నెలాఖరులోగా పార్వతీపురం పట్టణ ప్రజలకు టిడ్కో గృహాలు అప్పగిస్తామని, మిగిలిన వారికి షేర్ క్యాపిటల్‌ను చెల్లించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ధర్నా సమయంలో కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంబంధించిన నగదు రూ. 2.25 కోట్లు పురపాలక సంఘ ఖాతాకు జమయ్యాయని, త్వరలోనే చెల్లింపులు చేస్తామని చెప్పారు.


