శృంగవరపుకోట:
చంద్రబాబు సర్కారు సమస్యలను గాలికొదిలేసింది. డీఆర్‌సీ సమావేశానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. తేదీ నిర్ణయిస్తారు. మళ్లీ కాదంటారు. డీఆర్సీ సమావేశాల్ని మొక్కుబడి తంతుగా మార్చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఎస్.కోటలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ రైతు సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని మొత్తుకున్నా దిక్కులేదని, క్వింటాకు రూ.2,400 మద్దతుధర రైతుకు అందడం లేదని, దళారులకు రూ.1500లకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నిన్నటిదాకా ఎరువుల కొరత ఉంటే నేడు జిల్లాలో గ్యాస్ కొరత. గ్యాస్ కొనలేక అవస్థ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. జిల్లా బడ్జెట్ ఒట్టి డొల్ల, సాగునీరు, పరిశ్రమలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు, తాగునీరు, సాగునీటికి, ట్రైబల్‌యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కేటాయింపుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.


