ఎంతపని చేశావు కన్నా... | - | Sakshi
Sakshi News home page

ఎంతపని చేశావు కన్నా...

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

ఎంతపని చేశావు కన్నా...

పాలకొండ రూరల్‌:

మీ చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.. మీ పోషణ బాధ్యత నాపై పడింది.. రెక్కలుముక్కలు చేసుకుని మీరే సర్వస్వంగా బతికాను. కష్టం తెలియకుండా పెంచాను. ఆదుకుంటారనుకున్న సమయంలో ఇలా.. బలవంతంగా ప్రాణం తీసుకుని ఎంత పనిచేశావు కన్నా అంటూ ఆ తల్లిపెట్టిన రోదన అక్కడివారిలో కన్నీరుపెట్టించింది. తల్లి మందలించిందని కుమారుడు గడ్డిమందు తాగి మరణించిన ఘటన రుద్రిపేటలోని ఓ పేదింట విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

పాలకొండ మండలంలోని రుద్రిపేట గ్రామానికి చెందిన పారిశిర్లి పాపారావు, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లల చిన్నవయస్సులోనే తండ్రి పాపారావు అనారోగ్యంతో మృతిచెందారు. విజయ కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమారులను పెంచింది. రెండో కుమారుడు హరికృష్ణ(27)డిగ్రీ వరకూ చదువుకున్నాడు. కుటుంబ పోషణకు తనవంతు సహకరించేందుకు ఇటీవల విజయవాడలో ఓ పెట్రోల్‌ బంక్‌లో చేరాడు. స్వగ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆదివారం తన స్నేతులతో కలిసి ఆలస్యంగా ఇంటికి చేరిన కుమారుడిని తల్లి మందలించింది. పెళ్లికావాల్సిన సమయంలో స్నేహితులతో కలిసి చెడుతున్నావని, సరైన మార్గంలో నడవాలని హెచ్చరించింది. తీవ్ర మనస్థాపానికి గురినై హరికృష్ణ రాత్రి సమయంలో గడ్డిమందు సేవించారు. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ అర్ధరాత్రి తర్వాత హరికృష్ణ మరణించాడు. చిన్నకొడుకని అల్లారు ముద్దుచేసి నందుకు ఎంతపని చేశావు కన్నా అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement