ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..?
● కలవని మనసులు
● మరోసారి బట్టబయలైన టీడీపీలో వర్గ విభేదాలు
పసుపు
పండగలోనూ..
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని కూటమి పార్టీల మధ్య ఎటూ కుంపట్లు ఉన్నాయి. పోనీ, అక్కడంటే మనుషులు కలిసినంత సులువుగా మనసులు కలవలేదని సర్ది చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు వరకే ఒక్కటిగా ఉన్నా.. తర్వాత ఎవరి జెండా ‘రంగు‘ వారిదేనని ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగమైంది. సొంత తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యనే సఖ్యత లేదని పలు ఉదంతాలు రుజువు చేశాయి. పార్టీ పండగ అయిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలోనూ మరోసారి ఇదే విషయం తేటతెల్లమైంది. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం గమనార్హం. జిల్లా కేంద్రం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలో గ్రూపుల గోల ఎప్పటి నుంచో ఉన్న విషయం విదితమే. పార్టీ వేడుకను సైతం ఎవరికి వారు చేసుకున్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, సీతారాం వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. సాలూరులోనూ పార్టీ సీనియర్ నేత భంజ్‌దేవ్‌ను మరో వర్గం పక్కన పెట్టేసింది. మంత్రి సంధ్యారాణి గ్రూపు, భంజ్‌దేవ్ వర్గం వేర్వేరుగా కార్యక్రమం జరిపారు.
పైకే సఖ్యత.. లోపల కత్తులు
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపులు.. ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగుతున్నాయి. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు, మూడు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. పైకి ఒకే పార్టీలా కనిపిస్తున్నా.. లోపల ఒకరి మీద మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిని ఇంకొకరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సాలూరులో సంధ్యారాణి, భంజ్‌దేవ్, తేజోవతి వర్గాలుండగా.. పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర, ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు, మరో రెండు మూడు వర్గాలున్నాయి. కురుపాంలో వీరేష్‌చంద్రదేవ్, విప్ తోయక జగదీశ్వరిలు ఉప్పు–నిప్పులా ఉన్నారు. పాలకొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పడాల భూదేవి – జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక.. అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజురు తేజోవతిని జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తిగా పట్టించుకోవడం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను జిల్లా కేంద్రంలో కలిసే నిర్వహించినా.. తేజోవతి విషయంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకత చూపుతున్నారన్న గుసగుసలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయం విషయమై తేజోవతి ప్రయత్నించగా.. స్థలం దగ్గరకు వచ్చేసరికి ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారని సమాచారం. ఈ పంచాయితీ ‘ఉన్నత’ స్థాయి వరకూ వెళ్లింది. పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాల్లోనూ, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకూ ఆమెను జిల్లా కేంద్రంలో ఏ ఒక్కరూ ఆహ్వానించడం లేదని తెలిసింది. ప్రోటోకాల్ విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని సన్నిహితుల వద్ద ఆమె వాపోతున్నట్లు సమాచారం. సాలూరు నియోజకవర్గంలోనూ పార్లమెంట్ అధ్యక్షురాలికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల జరిగిన వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించలేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీస సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. పార్టీ క్యాడర్ సైతం జిల్లా అధ్యక్షురాలిగా కనీస గౌరవం ఇవ్వడం లేదని సమాచారం. నూతన సంవత్సరం, సంక్రాంతి, శంబర పండగ సందర్భాల్లో మంత్రి వర్గీయులు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిన్నాచితక నాయకుల బొమ్మలను కూడా వాటిలో పెట్టినా.. ఎందులోనూ తేజోవతి ఫొటో లేదు. కొద్ది రోజుల క్రితం మక్కువ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తేజోవతి ప్రత్యేకంగా ఓ వర్గాన్ని పోషిస్తున్నట్లు మంత్రి వర్గం బహిరంగ ఆరోపణలకు దిగింది. దీంతో పార్టీ క్యాడర్ మధ్యే మాటామాటా పెరిగింది. కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపులను ఎవరికి వారు ప్రోత్సహిస్తుండటంతో క్యాడర్‌లో కూడా చీలిక వచ్చింది. ఎటువైపు వెళ్లాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వైఖరి నచ్చక పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో అధిక శాతం మంది వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారు.


