మౌన విస్ఫోటనం పతంజలి స్వరం | - | Sakshi
Sakshi News home page

మౌన విస్ఫోటనం పతంజలి స్వరం

Mar 30 2026 8:50 AM | Updated on Mar 30 2026 8:50 AM

మౌన విస్ఫోటనం పతంజలి స్వరం

విజయనగరం టౌన్‌: మౌన విస్ఫోటనం పతంజలి స్వరమని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ పేర్కొన్నారు. కె.ఎన్‌.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కార స్వీకర్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా? అన్న ప్రశ్న అలమండ గ్రామ కేంద్రంగా తలెత్తినా, అది విశ్వవ్యాపిత చర్చగా నేడు మారడం గమనించదగ్గ విషయమన్నారు. తన కవితలో ఫ్లైఓవర్‌ని ‘ఆకాశ వంతెన’ అని రాసినందుకు పతంజలి ఫోన్‌ చేసి ప్రశంసించిన విధానం తనలో సమాజం పట్ల మానసిక క్రమశిక్షణకు దోహదపడిందన్నారు. అనంతరం వేదిక ప్రతినిధులు కుప్పిలి పద్మకు పతంజలి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ అనేక రుగ్మతలతో బాధపడుతున్న సమాజానికి తన అక్షరాలతో వైద్యం చేసిన హోమియోపతి పతంజలి అని కొనియాడారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఆయన రచనలు సజీవమన్నారు. ఇప్పటికే పాత్రికేయ రంగంలోనూ, సాహిత్యంలోనూ తమదైన శైలిలో పతంజలిని అనుసరించిన వారిని ఎంపిక చేసి చిరు పురస్కారంతో గౌరవించుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సాహితీవేత్త ఆల్తి మోహన్‌ మాట్లాడుతూ రాజ్యాంగానికి గల నాలుగు ప్రధాన అంగాల్లో లోపభూయిష్ట వ్యవహారాల మీద తన అక్షరాలతో దండెత్తారన్నారు. ప్రజాసేవ పేరిట భూవ్యాపారం చేస్తారని ఆనాడే ఊహించిన దార్శనీకుడు పతంజలి అని రచయిత మహమ్మద్‌ ఖదీర్‌బాబు వివరించారు. ఎన్‌కె.బాబు, విఎంకె.లక్ష్మణరావు, భళ్లమూడి నాగేంద్రప్రసాద్‌, పతంజలి కుటుంబ సభ్యులు డాక్టర్‌ ప్రతాప్‌ వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement