● కోలగట్ల కుటుంబాన్ని
పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉప సభాపతి, విజయనగరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మనశెట్టి ఆకస్మిక మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేడాడ తిలక్, వైఎస్సార్సీపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు స్వరూప్ తదితర నాయకులు కలిసి విజయనగరంలోని వారి నివాసానికి శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు తమ్మనశెట్టి చిత్రపటానికి నివాళులర్పించి, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ్మనశెట్టి అత్యంత వినయశీలి అని, సేవాభావం కలిగిన వ్యక్తిగా సమాజంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. ఆయన మృతి కోలగట్ల కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికే తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కోలగట్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.


