చంద్రబాబువి డైవర్షన్‌ పాలిట్రిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి డైవర్షన్‌ పాలిట్రిక్స్‌

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

విజయనగరం: కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబువన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని, అమరావతి రాజధానిపై అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడమంతా డ్రామా అంటూ విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుంటున్నా అభివృద్ధి చేయడంలో అలసత్వం ఎందుకుని ప్రశ్నించారు. విజయనగరం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో శఽనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనపై దుమ్మెత్తిపోశారు. గడిచిన రెండేళ్లలో అమరావతి రాజధాని పేరిట అవినీతికి పాల్పడడం, అక్కడి రైతులను మోసం చేయడం, ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పబ్బంగడుపుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే 2028 చివరికి అమరావతి రాజ ధాని నిర్మాణాన్ని పూర్తిచేసి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అసమర్ధపాలనను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అత్యవసర తీర్మానాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న చంద్రబాబును ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారని, రాజధాని నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ చేస్తామన్నారే తప్ప రాజధానిగా అమరావతిని వ్యతిరేకించలేదన్న విష యం గుర్తెరగాలన్నారు. కూటమి ప్రభుత్వం తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సా ర్‌సీపీపై దుష్ఫ్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

అమరావతి పేరిట దోపిడీని వ్యతిరేకిస్తాం..

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీ అమరావతిగా రాజధాని నిర్ణయానికి వ్యతిరేకం కాదని, కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీని మాత్రమే ఎత్తిచూపుతున్నట్టు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సుమారు ఎకరాకు రూ.2కోట్ల చొప్పున అభివృద్ధికి ఖర్చు అవుతుందని, ఇలా 50వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం రోజువారి పాలనకే అప్పులు చేస్తోన్న ప్రభుత్వం, ఇంత ఖర్చు ఎలా భరిస్తోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం మాయమాటల చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఇటువంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు.

రెండేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి పేరుచెప్పి రూ.47వేల కోట్ల అప్పులు తెచ్చి అవినీతి కార్యక్రమాలు చేపట్టారే తప్ప అభివృద్ధి చేయలేదని, తాజాగా అమరావతి రాజధాని అంటూ డైవర్షన్‌ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణ పనులు చూస్తున్న మంత్రితో ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో ఇదే విషయం తేటతెల్లమైందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రెండేళ్లుగా మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. అమరావతిలో ఒలింపిక్స్‌ పోటీలు నిర్వహిస్తామని, బుల్లెట్‌ ట్రైన్‌లు నడుపుతామని, ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తామని, మరో 50వేల ఎకరాలు భూసేకరణ చేయాలంటూ మాయమాటలు చెప్పడం తప్ప భూములిచ్చిన రైతులకు ఒక్కఫ్లాట్‌ ఇవ్వని దుర్భర స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

2029 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరల అధికారంలోకి రాలేమన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం అభద్రతా భావంతో రాజధానిగా అమరావతి తీర్మానం చేసిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని అమరావతిలో ఇప్పటికే సొంత ఇళ్లు కట్టు కుని ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం సాధ్యంకాని హామీ లు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. కేవలం అవినీతి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. వైఎస్సార్‌సీపీపై నిందలు మోప డం తప్ప ప్రభుత్వం చెప్పిన హైటెక్‌ మాటలు, సింగపూర్‌ డిజైన్‌లు సాధ్యంకానివని చెప్పారు. రెండేళ్ల ప్రభుత్వ అసమర్ధ, అవినీతి పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తాము చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా కొత్త అభివృద్ధి లేదన్నారు.

నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయని, గ్యాస్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చివరికి కర్రల పొయ్యిపై వంటలు చేసుకోవాలన్నా వాటి ఖరీదు ఆకాశన్నంటుతోందన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం తీరుమార్చుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement